ల‌క్ష కోట్ల సంప‌ద‌ను లూటీ చేసిన కేసీఆర్ కుటుంబం

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి

సిరిసిల్ల : ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి మాజీ సీఎం కేసీఆర్ ను ఏకి పారేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని, వాదాన్ని అడ్డం పెట్టుకుని అడ్డ‌గోలుగా సంపాదించార‌ని ఆరోపించారు. అంతే కాకుండా కేసీఆర్ ఫ్యామిలీ ఏకంగా రూ. 1 ల‌క్ష కోట్ల సంప‌ద‌ను కూడ‌బెట్టార‌ని మండిప‌డ్డారు. ఇందుకు సంబంధించి త‌మ వ‌ద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయ‌ని అన్నారు. సిరిసిల్ల‌లో జ‌రిగిన స‌భ‌లో ఆయ‌న ఈ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఉద్యమం పేరుతో అందినంత మేర రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. తనతో పాటు మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, టి. హరీష్ రావు, జె. సంతోష్ కుమార్ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావుకు ఆయన సవాల్ విసిరారు.

కేసీఆర్ కు , ఆయ‌న ఫ్యామిలీకి ద‌మ్ము, ధైర్యం , క‌లేజా ఉంటే త‌మ ఆస్తుల పై శ్వేత ప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యుల యాజమాన్యంలోని ఆస్తులు, ఫామ్‌హౌస్‌ల మూలాలు , యాజమాన్య హక్కులపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు, అలాగే విదేశాలలో ఉన్నట్లుగా చెబుతున్న వారి పెట్టుబడులు, ఆస్తుల గురించి వివరణ కోరారు. ఇదిలా ఉండ‌గా సిరిసిల్లలో తనకు ఉన్న 8,000 ఎకరాల భూమికి సంబంధించి ప్రభుత్వం చేసిన ఆరోపణలపై శ్వేతపత్రం , ఆధారాలతో కూడిన వివరాలను అందించాలని కేటీఆర్ ఇటీవల డిమాండ్ చేశారు. దీనికి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తుల చేతిలో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు , భూములు స్వల్ప కాలంలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులకు బదిలీ అయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అలాగే హైదరాబాద్ , దాని పరిసర ప్రాంతాలలో హోటళ్లు, సర్వీస్ అపార్ట్‌మెంట్‌లతో సహా వివిధ ఆస్తులను కేటీఆర్ ఎలా పొందారో చెప్పాల‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!