ఉద్యోగుల‌కు ఖుష్ క‌బ‌ర్ డీఏల‌కు లైన్ క్లియ‌ర్

రెండు డీఏల‌కు ఆమోదం తెలిపిన కేబినెట్

హైద‌రాబాద్ : ద‌స‌రా పండుగ వేళ ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పింది రాష్ట్ర స‌ర్కార్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు , పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రెండు డి.ఎలను మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. 2024 నుండి పెండింగ్‌లో ఉన్న రెండు డి.ఎ బకాయిలను తక్షణమే మంజూరు చేయాలని నిర్ణయించారు. ఈ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తారు. ప్ర‌స్తుతం ఆర్థిక భారం ఉన్నప్పటికీ ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డి.ఎ , పెన్షనర్లకు డి.ఆర్ మంజూరుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏటా రూ. 2,500 కోట్ల భారం పడనుంది.

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్రంలో ‘ఎల్ నినో’ పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు. ప్రస్తుతం రుతుపవనాల సీజన్‌లో సుమారు 17 శాతం వర్షపాత లోటు ఉంది. నిన్నటితో రుతుపవనాల కాలం ముగిసింది. తగినంత వర్షాలు లేకపోవడం వల్ల సుమారు 235 మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. కరువు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మంత్రివర్గ ఉపసంఘంలో సమగ్రంగా చర్చించాలని సమావేశం నిర్ణయించింది. ఈ అంశంపై త్వరలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వివిధ రంగాలకు చెందిన నిపుణులు , రైతు సంఘాలతో కూడా సమావేశాలు నిర్వహిస్తారు.

మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఎల్ నినో పరిస్థితులు , చేపట్టాల్సిన సహాయక చర్యలపై అన్ని వర్గాల నుండి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు. కరువు మండలాలను ప్రకటించి, రాష్ట్రానికి తగిన సహాయం అందించాలని రాష్ట్ర మంత్రివర్గం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనికి అనుగుణంగా మంత్రుల బృందం త్వరలో ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలోని పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Leave A Reply

Your Email Id will not be published!