హైదరాబాద్ : ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వరి సేకరణకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల శాఖ అంచనా వేసిందని తెలిపారు. సేకరణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 15,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని, అయితే ఈ సీజన్లో గరిష్ట డిమాండ్ 19,892 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరిందన్నారు. గత ఏడాది గరిష్ట వినియోగం 16,613 మెగావాట్లుగా నమోదైందని పేర్కొన్నారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి , తగినంత సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఉత్తమ్ వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరాను నిర్ధారించడానికి అవసరమైనంత విద్యుత్‌ను సేకరించాలని , డిమాండ్‌కు అనుగుణంగా కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. భవిష్యత్తు డిమాండ్ , అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కొత్త పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి , విద్యుత్ అనుసంధానంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సుమారు 7,800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో యూనిట్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
3,000 మెగావాట్ల సౌర విద్యుత్, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ , 800 మెగావాట్ల పవన విద్యుత్ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై చర్చించినట్లు తెలిపారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఈ ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారన్నారు.
రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సమీకృత పండ్ల మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని , ఈ మార్కెట్‌ను పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను సమీక్షించాలని , . గత ఆదేశాల ప్రకారం పూర్తికాని EPC పద్ధతిలోని ప్రాజెక్టులను రద్దు చేయాలని , ఇందులో భాగంగా, 10 EPC సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వెల్లడించారు మంత్రులు. తెలంగాణలో డిజిటల్ మీడియా ప్రకటనల కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేసే ప్రతిపాదనకు ఓకే చెప్పిందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్’ రూపొందించిన డిజిటల్ ప్రకటనల విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ఇదే పాలసీని అమలు చేస్తామన్నారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో గల రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున విధులు నిర్వర్తించేందుకు ఒక డిప్యూటీ కమిషనర్ పదవితో పాటు మరో నలుగురు గ్రూప్-1 అధికారులను నియమించడానికి ఆమోదం తెలిపిందన్నారు.
