తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామసభలు
కీలక ప్రకటన చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంగా గాంధీ జయంతి నుంచి ప్రారంభమైంది. ఈ ప్రత్యేక గ్రామ సభ లక్ష్యం గ్రామీణ ప్రాంతాలకు జలసమృద్ది, నేల సంరక్షణ సంస్కరణలను చేర వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరవ కల్పించడం. అవగాహన, భాగస్వామ్యం , కమ్యూనిటీ యాజమాన్యం ద్వారా దీనిని ఒక ప్రజా ఉద్యమంగా (జన్ ఆందోళన్) మార్చడం దీని ముఖ్య ఉద్దేశ్యం అని స్పష్టం చేసింది. గ్రామ సభల ద్వారా అందరి భాగస్వామ్యంతో ప్రణాళిక తయారు చేయడం, ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనేలా చూడడం. దీనిని 9,593 గ్రామ పంచాయితీలలో విస్తరింపజేసి, ఆ తర్వాత జిల్లా , ప్రాజెక్ట్ స్థాయిలలో కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపింది. ఆయా ప్రాంతాలలో ప్రధానంగా వాటర్‌షెడ్ అభివృద్ధి కార్యక్రమాల కింద దాదాపు 3.4 కోట్ల హెక్టార్ల భూమిని కవర్ చేసినట్లు పేర్కొంది సర్కార్ . దీంతో భూగర్భ జలాల మట్టం 3 మీటర్ల వరకు పెరిగిందని తెలిపింది.
సాగు విస్తీర్ణం 30% వరకు పెరిగిందని, పీడిత ప్రాంతాల రైతులు ఒకటి కంటే ఎక్కువ పంటలు పండించే స్థాయికి చేరారని , దీనివల్ల పాల ఉత్పత్తి 40% పెరగగా, రైతుల వార్షిక ఆదాయం 70% వరకు పెరిగిందని తమ సర్వేలో వెల్లడైందని స్పష్టం చేసింది. మెరుగైన ఫలితాల కోసం హెక్టారుకు ఇచ్చే నిధులను పెంచినట్లు తెలిపింది. మైదాన ప్రాంతాలలో హెక్టార్ కు రూ. 12 వేల నుండి రూ. 22 వేలకు , కొండ ప్రాంతాలలో హెక్టారుకు రూ. 15 వేల నుంచి రూ. 288 వేల వరకు పెంచినట్లు పేర్కొంది. ప్రాజెక్ట్ పూర్తి చేసే కాలాన్ని 7 సంవత్సరాల నుండి 5 సంవత్సరాలకు తగ్గించడం, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, స్థానిక వాతావరణానికి సరిపోయే మొక్కలను అందిస్తున్నట్లు తెలిపింది సర్కార్.
