హైదరాబాద్ : కేంద్ర ఎన్నికల సంఘం నిర్వాకంపై నిప్పులు చెరిగారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో ముస్లింలకు వ్యతిరేకంగా ‘ఫారం-7’ దుర్వినియోగం జరుగుతోందని వాపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సమయంలో తప్పుడు ‘ఫారం-7’ దరఖాస్తులు దాఖలు చేయడం ద్వారా ముస్లిం ఓటర్లను జాబితా నుండి తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహహం వ్యక్తం చేశారు. మిలాద్ మైదాన్‌లో జరిగిన 57వ ‘జల్సా-ఎ-మిలాద్-ఉన్-నబీ’ కార్యక్రమంలో మాట్లాడారు. తప్పుడు ఫారం-7 దరఖాస్తులు దాఖలు చేస్తున్నట్లయితే ఎన్నికల సంఘం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ తతంగం ఆగకపోతే గుర్తుంచుకోండ. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల కంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ వీధుల్లో నిరసనలు జరుగుతాయని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అసదుద్దీన్ ఓవైసీ.
ఇది మీకు చాలా ఇబ్బందులను కలిగిస్తుందని పేర్కొన్నారు. మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఊరుకోదు జాగ్రత్త అని అన్నారు. ఓటర్ల జాబితాలో పేరు చేర్చడాన్ని వ్యతిరేకించడానికి లేదా నిర్దిష్ట కారణాలతో ఏదైనా నమోదును తొలగించడానికి ‘ఫారం-7’ను ఉపయోగిస్తారని పేర్కొన్నారు. తుది ఓటర్ల జాబితా నుండి ముస్లిం ఓటర్లను తొలగించడానికి బీజేపీ , సంఘ్ పరివార్ ‘ఫారం-7’ను దుర్వినియోగం చేస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు ఓవైసీ. తొలగించాల్సిన వ్యక్తి పేరుతో ముద్రించిన ఫారం-7లను సమర్పిస్తున్నారని, కానీ ఆ ఫారం దాఖలు చేసే వ్యక్తి పేరు, వివరాలను మాత్రం ఇవ్వడం లేదన్నారు ఎంపీ. దీనిని అనుమతించ కూడదని తాము తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారికి , జిల్లా ఎన్నికల అధికారులకు తెలియ పర్చడం జరిగిందన్నారు.
