అమరావతి : సాగుకు సంబంధించి రైతులకు కీలక సూచనలు చేశారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు నాయుడు. బుర్రిపాలెంలో జానకీరామ్ అనే రైతుకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. కీలక సూచనలు చేశారు కేంద్ర మంత్రి. ఎలాంటి రసాయనాలు, ఎరువులు వాడకుండా సాగు చేస్తున్న రైతు జానకీ రామ్‌ను భుజం తట్టి అభినందించారు. జానకీరామ్ అవలంభిస్తున్న సాగు పద్దతులు, సాగు ఖర్చు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి సాగును ప్రొత్సహిస్తున్నందుకు , చర్యలు తీసుకుంటున్నందుకు ప్రత్యేకంగా కేంద్ర మంత్రి సీఎం చంద్రబాబు నాయుడును ప్రశంసించారు. రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్-1 స్థానంలో నిలిపారంటూ పేర్కొన్నారు.
వ్యవసాయ క్షేత్ర సందర్శన సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడారు. .ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తోందని పేర్కొన్నారు. 50 లక్షల ఎకరాల్లో ప్రకృతిసాగు చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుందని తెలిపారు. ఎలాంటి ఎరువులు, కెమికల్స్ వాడకుండా ప్రకృతి సాగు చేయడం చాలా ఆనందాన్నిస్తోంది అని అన్నారు కేంద్ర మంత్రి. బీజామృతం.. జీవామృతాలతో సాగు చేస్తున్నారని, ఈ రైతును మిగతా రైతులు ఆదర్శంగా తీసుకోవాలని, ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేయాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి . ప్రకృతి సాగులో ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకృతి సాగును ప్రొత్సహిస్తున్నారని చెప్పారు.
ప్రధాని లక్ష్యాలకు అనుగుణంగా ఏపీలో ప్రకృతి సాగు జరుగుతోందన్నారు. ప్రకృతిసాగుతో ప్రజారోగ్యం బాగుంటుంది.. భూసారం పెరుగుతుందన్నారు. భూసారం బాగుంటే చక్కటి పంట వస్తుందని, చక్కటి పంట వస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రకృతి సాగు చేసేలా కృషి చేస్తున్న సీఎం చంద్రబాబు కు అభినందనలు పేర్కొన్నారు. నేచురల్ ఫార్మింగ్ పద్దతిలో ఎకరా వరి సాగుకు కేవలం రూ.7 వేలు మాత్రమే ఖర్చు అవుతోందని రైతు జానకీ రామ్ చెప్పారన్నారు. అదే రసాయన ఎరువులతో సాగు చేస్తే ఎకరాకు రూ. 25 వేలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.పెద్ద ఎత్తున సాగు ఖర్చులు తగ్గుతున్నాయని, దీని వల్ల రైతుకు మేలు జరుగుతుందని చెప్పారు శివరాజ్ సింగ్ చౌహాన్.
