శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి పుష్కరిణి తీర్థ ప్రాశస్త్యం

దక్షిణ భారతదేశానికి మకుటాయమానం

తిరుమల : శ్రీ మహా విష్ణు పాదోద్భవమై, బ్రహ్మకర స్పర్శతో పవిత్రమై సనకసనందనాది యోగులచే కొనియాడబడినది ఈ స్వామి పుష్కరిణి తీర్థం. దక్షిణ భారతదేశానికి మకుటాయమానం తిరుమల క్షేత్రం. అత్యంత పావనము సర్వకామదాయకాలైన అరవై ఆరు కోట్ల తీర్థాలు తిరుమలక్షేత్రంలో ఉన్నాయని బ్రహ్మ పురాణం తెలియ జేస్తోంది. వీటిల్లో తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరం వైపున స్వామి పుష్కరిణి అనే మహత్తర తీర్థం ఉంది. ఇది వైకుంఠం నుంచి గరుడునిచే తీసుకు రాబడిన క్రీడా పర్వతంలో శ్రీ భూదేవులకు క్రీడా సరస్సుగా ఉన్నట్టు పురాణాల్లో చెప్పబడింది. ఈ తీర్థ ప్రస్తావన వరాహ, పద్మ, మార్కండేయ, వామన, స్కాంద, బ్రహ్మ, భవిష్యోత్తర పురాణాలలో కన్పిస్తుంది. వేంకటా చలంలో ఉన్న తీర్థాలకు ఈ పుష్కరిణి అవతార స్థానంగా పేర్కొనబడింది.స్వామి పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంది. విజయనగర రాజు సాలువ నరసింహరాయలు పుష్కరిణి మధ్యలో నీరాళీ మండపం నిర్మించారు. ఆ త‌రువాత శ్రీ‌వారి భ‌క్తాగ్రేస‌రుడు శ్రీ తాళ్ల‌పాక అన్న‌మ‌య్య ఆ మండ‌పం అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకున్నారు. శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో ప్ర‌తిరోజూ ఉద‌యం, రాత్రి వాహ‌న‌సేవ‌ల్లో పుష్క‌రిణి వ‌ద్ద హార‌తి ఇస్తారు. మిగ‌తా స‌మ‌యంలో ప్ర‌తిరోజూ సాయంత్రం స‌హ‌స్ర దీపాలంకార సేవ అనంత‌రం పుష్క‌రిణి హార‌తి ఇస్తారు. పుష్క‌రిణి హార‌తి, పూజ గురించి 12 శ‌తాబ్దం నాటి శాస‌నాల్లోనూ పొందు ప‌రిచారు.

విజ‌య‌న‌గ‌ర సామ్రాజ్యాధినేత శ్రీ‌కృష్ణ దేవ‌రాయ‌ల కాలం నుంచి పుష్క‌రిణి హార‌తిని కొన‌సాగించిన‌ట్టు తెలుస్తోంది. 1972వ సంవ‌త్స‌రంలో శ్రీ‌వారి పుష్క‌రిణిలో ఫిల్ట‌ర్ల‌తో పాటు కాలువ‌ల‌ను ఏర్పాటు చేశారు. త‌ర‌చుగా పుష్క‌రిణి నీటిని తొల‌గించి తాజా నీటితో నింపుతారు. కాగా స్వామి పుష్కరిణి తీర్థం సమస్త తీర్థాల సంగమంగా పేర్కొన బడింది . శ్రీమన్నారాయణుని పాద పద్మాల నుండి ప్రవహిస్తున్న స్వామి పుష్కరిణీ ప్రభావం వర్ణనాతీతం. దీన్నే విరజానది అని కూడా అంటారు. ఇది గంగాది సర్వతీర్థాలకు జన్మస్థానం. దీని దర్శనం, స్పర్శనం, స్మరణం కూడా సర్వాభీష్టాలను అనుగ్రహిస్తుంది. మార్గశిర శుద్ధద్వాదశినాడు ఆరుణోదయ వేళలో కోట్లాది తీర్థాలు స్వామి పుష్కరిణిలో ప్రవేశిస్తాయి. తద్వారా పాపాలన్నీ నశించి పోతాయని వరాహ, వామన పురాణాలు తెలియ జేస్తున్నాయి. స్వామి పుష్కరిణిలో స్నానం సర్వాభీష్ట ఫలప్రదం. ఎవరు ఏ కోరికతో ఇందులో స్నానం చేస్తే వారికి ఆ కోరిక త్వరలో సిద్ధిస్తుంది. పుష్కరిణి స్నానం సర్వపాప నిర్మూలకమని తారకవధ చేసిన కార్తికేయుడి వృత్తాంతం వల్ల తెలుస్తుంది. స్వామి పుష్కరిణిలో స్నానం చేసిన వారి వారి అభీష్టాలను పొందిన భక్తులను గురించి వరాహ, భవిష్యోత్తర, స్కాంద పురాణాలు మనకు వివరిస్తున్నాయి.: శ్రీరాముడు వానరసైన్యంతో వేంకటాద్రికి వెళ్లి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి దాని ప్రభావం చేతనే రావణాది రాక్షసుల్ని జయించి సీతాదేవిని తిరిగి పొందినట్లు భవిష్యోత్తర పురాణం తెలియ జేస్తోంది.

Leave A Reply

Your Email Id will not be published!