షూటింగ్ లో ఆస్తమాతో తీవ్ర ఇబ్బంది పడ్డా : దేవరకొండ
సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేసిన యువ నటుడు
హైదరాబాద్ : ప్రముఖ యంగ్ యాక్టర్ విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రణబాలి’ షూటింగ్ సమయంలో తీవ్రమైన ఆస్తమా దాడికి గురైనట్లు వెల్లడించారు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ క్లిష్టమైన అనుభవం గురించి వివరించారు. విజయ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన చిత్రంలోని ఒక కీలక సన్నివేశం కోసం దాదాపు 15 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొన్న తర్వాత జరిగిందన్నారు. ఆ సన్నివేశంలో భారీ సంఖ్యలో అఘోరాల మధ్య గాలిలో దట్టమైన బూడిద , పసుపు పొడి రేణువుల నడుమ నటించాల్సి వచ్చిందన్నారు విజయ్ దేవరకొండ.
దుమ్ము, ధూళితో కూడిన షూటింగ్ వాతావరణం, అలాగే ప్రోస్తెటిక్స్ , మేకప్ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు తెలిపారు. ఒక రాత్రి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ అకస్మాత్తుగా నిద్రలేచానని పేర్కొన్నారు. ‘బ్రోంకోస్పాజమ్’ (శ్వాసనాళాలు బిగుసుకు పోవడం) కారణంగా తన ఊపిరితిత్తులు బిగుసుకు పోయి, తీవ్రమైన ఆస్తమా దాడికి దారితీసిందని ఆయన చెప్పారు. ఆ అనుభవం చాలా కష్టంగా ఉందని, తాను ప్రమాదకరమైన పరిస్థితికి దగ్గరగా ఉన్నట్లు అనిపించిందని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. అయినప్పటికీ ఆ సన్నివేశాలు తెరపై సహజంగా కనిపించాలనే ఉద్దేశంతో సినిమా పైనే దృష్టి సారించానని చెప్పారు.
రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పీరియడ్ డ్రామా చిత్రం 2026 అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయం వెల్లడి కావడంతో సినిమా పట్ల, ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన చేసిన సవాలుతో కూడిన సన్నివేశాల పట్ల ప్రేక్షకులలో ఆసక్తి మరింత పెరిగింది.
