హైదరాబాద్ : చెరువులు కబ్జా కాకుండా కాపాడడమే కాకుండా వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న తీరు ఎంతో ఆదర్శంగా ఉంది. హైడ్రా అభివృద్ధి చేయక ముందు తర్వాత చెరువులను పరిశీలిస్తే ఎంతో మార్పు కనపడుతోంది. చెరువుల చెంత దుర్గంధం పోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది. కొన్ని చెరువులకే హైడ్రా పరిమితమైంది. మా ప్రాంతంలోని చెరువులను కూడా అభివృద్ధి చేయాలని హైడ్రా ప్రజావాణిలో పలువురు కోరారు. చెరువుల అభివృద్ధి అంటే సుందరీకరణ చేయడం కాకుండా.. చెరువులో 10 అడుగులకు పైగా పూడికను తొలగించి.. మొత్తం దుర్గాంధాన్ని పారదోలిన తీరు బాగుందన్నారు. ఇలా నగరంలో అన్ని చెరువులను అభివృద్ధి చేయాలని జనవాణి పేరిట ప్రజల సమస్యలపై పోరాడే సంస్థ హైడ్రాను కోరింది. చెరువుల వివరాలతో ఈమేరకు వినతిపత్రం సమర్పించింది. అభివృద్ధి చేసిన చెరువల్లోకి మురుగు నీరు చేరకుండా వర్షాకాలంలో వరద నీరు, మిగతా సమయంలో ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని పంపాలని విజ్ఞప్తి చేశారు. గండిపేట చెరువుతో పాటు.. హిమాయత్‌సాగర్ కూడా కలుషితమౌతోందని.. జంట జలాసయాలను కాపాడాలని కోరారు. ఈ మేరకు వినతి పత్రాలు అందజేశారు. హైడ్రా ప్రజావాణికి ఇలా మొత్తం 61 ఫిర్యాదులు రాగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వాటిని పరిశీలించారు. వెనువెంటనే పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ మండలంలోని నాగోలు చెరువు 14 ఎకరాల్లో విస్తరించి ఉందని, అయితే చెరువులోకి మురుగు నీరు చేరడంతో దుర్గంధంగా మారిందని వాపోయారు. చెరువు పరిసరాల్లో నివాసం ఉండలేక పోతున్నాం అన్నారు. నాగోలు చెరువును కూడా హైడ్రా అభివృద్ధి చేయాలని శ్రీనివాస ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రజావాణిలో విజ్ఞప్తి చేసింది.
కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం విలేజ్‌లోని సర్వే నంబర్లు 42, 43లో ఉన్న చెరువు ఎఫ్టీఎల్, బఫర్ పరిధిలో అపార్టుమెంట్లు కట్టేస్తున్నారని, వాటిని నిలువరించి చెరువును కాపాడాలని అక్కడి నివాసితులు కోరారు. రావిర్యాల పెద్ద చెరువులో ఆక్రమణలు స్పష్టంగా ఉన్నాయి. మట్టి పోసి నింపేశారు. అక్కడ లే ఔట్లకు అనుమతులు కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు లే ఔట్లు మునిగి పోతున్నాయని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చెరువు ఎఫ్టీఎల్ పరిధి ఎంత.. బఫర్ జోన్ హద్దులను నిర్ధారించి చెరువును కాపాడాలని స్థానికులు కోరారు. ఈ చెరువును అభివృద్ధి చేస్తే మంచి పర్యాటక ప్రాంతమవ్వడమే కాకుండా.. మత్స్యకారులకు కూడా ఉపయోగంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు.మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, సాయిబాబానగర్, కృషికాలనీలో రహదారిని ఆక్రమించి.. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి భవనాన్ని నిర్మించేశారని ఆ కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కట్టడంపై తాము కోర్టుకు వెళ్లామని.. ఆ భవన నిర్మాణ అనుమతులను హైకోర్టు రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తిరిగి ఇప్పుడు అదే స్థలంలో మళ్లీ భవనాన్ని నిర్మించాలని చూస్తున్నారని .. వెంటనే ఆ నిర్మాణాలను అడ్డుకుని రహదారిపై ఆటంకాలు లేకుండా చూడాలని కోరారు.
సికింద్రాబాద్, మచ్చబొల్లారం జొన్నబండ సర్వే నంబరు 33, 34లోని శ్రీ గణేష్ ఎన్‌క్లేవ్‌లో ప్రజావసరాలకు ఉద్దేశించిన 1800ల గజాల స్థలాన్ని కబ్జా చేసేయాలని.. ల్యాండ్ ఓనర్ ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. లే ఔట్ వేసినప్పుడు స్పష్టంగా కేటాయించారని.. లే ఔట్ ప్రకారం ఆ 1800ల గజాల స్థలాన్ని కాపాడాలని హైడ్రాను కోరారు. బాగ్ అంబర్‌పేటలోని బతుకమ్మకుంటను అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి వరద ముప్పు తప్పించిన హైడ్రా.. తాజాగా ఆ ప్రాంతంలో పైపులైన్ల పనులు కూడా చేపట్టి.. వరద నీరు నేరుగా చెరువులోకి చేరిన తర్వాత.. మూసీకి చేరే విధంగా ఏర్పాట్లు చేయడాన్ని అక్కడి గాయత్రి టవర్స్ నివాసితులు అభినందించారు. పనులు త్వరగా పూర్తి చేసి అంబర్‌పేట పరిసరాల్లో శాశ్వతంగా వరద ముప్పు లేకుండా చూడాలని కోరారు.
