అమరావతి : పుష్కరాల ప్రారంభం నాటికి తొలి ఆరు యూనిట్లను సిద్ధం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. దీనికి అనుగుణంగా నిర్మాణ సంస్థ ఎం ఈ ఐ ఎల్ , జెన్కో అధికారులు సమన్వయంతో పనులను వేగవంతం చేస్తున్నారు. సివిల్ నిర్మాణ పనులతో పాటు టర్బైన్, జనరేటర్, ఇతర ఎలక్ట్రో-మెకానికల్ పరికరాల ఏర్పాటు పనులను దశల వారీగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఏపీ జెన్కో హైడల్ విభాగం డైరెక్టర్ సుజయ్‌కుమార్ మాట్లాడుతూ.. పోలవరం జల విద్యుత్ కేంద్రం రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ఎంతో ప్రాధాన్యమైన ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులను పూర్తి చేసేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రతి యూనిట్ పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ముందుకు సాగాలని అన్నారు.
స్టాటర్, రోటర్ వంటి కీలక పరికరాల ఏర్పాటు సమయంలో అత్యంత కచ్చితత్వం అవసరమని, ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటిస్తూ పనులు చేపట్టాలని సూచించారు. యూనిట్ల పనులు ఒక్కొక్క దశను దాటుతున్న కొద్దీ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం మరింత చేరువవుతుందని తెలిపారు. ఆరు యూనిట్లను నిర్దేశిత సమయానికి అందుబాటు లోకి తీసుకు రావడమే ప్రస్తుత ప్రధాన లక్ష్యమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాజెక్ట్ ను అనుకున్న సమయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉన్నారని అన్నారు.
పోలవరం విద్యుత్ కేంద్రం నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్‌బాబు అంగర మాట్లాడుతూ.. ప్రాజెక్టులో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల పనులను సమాంతరంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలకమైన ఎలక్ట్రో-మెకానికల్ పరికరాల ఏర్పాటు పనులను నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా చేపడుతున్నామని చెప్పారు. తొలి యూనిట్లో స్టాటర్ ఏర్పాటు, రోటర్ బిగింపు పనులు ప్రారంభం కావడం ప్రాజెక్టు పురోగతిలో ముఖ్యమైన మైలురాయి అని పేర్కొన్నారు. పనుల వేగాన్ని పెంచడంతో పాటు ప్రతి దశలో నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఆరు యూనిట్లను లక్ష్య సమయానికి సిద్ధం చేసేందుకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగిస్తూ ఇంజినీరింగ్ బృందాలు నిరంతరం పని చేస్తున్నాయని చెప్పారు.
పోలవరం జల విద్యుత్ కేంద్రంలోని 12 యూనిట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. జల విద్యుత్ కావడంతో ఇంధన వ్యయ భారం లేకుండా నీటి ప్రవాహాన్ని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది. రాష్ట్ర విద్యుత్ వ్యవస్థలో పీక్ డిమాండ్ సమయంలో ఈ కేంద్రం ఉత్పత్తి చేసే విద్యుత్ కీలకంగా ఉపయోగ పడనుంది. ప్రస్తుతం తొలి యూనిట్లో స్టాటర్, రోటర్ పనులు ప్రారంభం కావడంతో మిగిలిన యూనిట్లలోనూ సంబంధిత పనులను వేగవంతం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తిచేసేందుకు జెన్కో, ఎంఈఐఎల్ అధికారులు సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.
