హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి సంబంధించి ఆయన పదే పదే అక్రమాల గురించి ప్రస్తావిస్తూ వస్తున్నారు. తాజాగా మాజీ సీఎం ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఇందులో భాగంగా మాయమై పోయిన 45 ఎకరాలను గుర్తించాలని ఆదేశించారు ఉన్నతాధికారులను సీఎం. ఆ భూమికి సంబంధించి కేసీఆర్కు నోటీసులు ఇవ్వాలని అన్నారు. సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని సర్వే నంబర్ 325లో అదృశ్యమైన 45 ఎకరాల భూమిని గుర్తించాలని స్పష్టం చేశారు. ఆ సర్వే నంబర్లో రికార్డైన మొత్తం 388 ఎకరాలలో కేవలం 343 ఎకరాలు మాత్రమే తమ సర్వేలో తేలిందని అన్నారు. మిగతా 45 ఎకరాల ఆచూకీ తెలియడం లేదని రెవెన్యూ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఎర్రవల్లి పొరుగున ఉన్న వెంకటాపురం గ్రామాలకు సంబంధించిన భూమి వ్యవహారంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సర్వే , రెవెన్యూ రికార్డుల స్థితిగతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమీక్ష అనంతరం అదృశ్యమైన భూమి ఎక్కడ ఉందో , దాని ప్రస్తుత స్థితి ఏమిటో నిర్ధారించడానికి సర్వే నంబర్ 325లో సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భూమి గుర్తింపు ప్రక్రియలో భాగంగా ఎర్రవల్లి , వెంకటాపురం గ్రామాలకు సర్వే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ ప్రాంతానికి ఆనుకుని భూములు కలిగిన మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు , ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేయాలన్నారు. వారి వద్ద ఉన్న సంబంధిత రెవెన్యూ రికార్డులను సమర్పించాలని కోరాలని కూడా సూచించారు.
సర్వే రికార్డుల పరిశీలన పూర్తయిన తర్వాత సర్వే నంబర్ 325లోని భూమిని అర్హులైన స్థానిక రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రాణత్యాగం చేసిన వారి కుటుంబాల కోసం ‘తెలంగాణ అమరవీరుల కాలనీ’ని నిర్మించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అమరవీరుల కుటుంబాలకు నివాస స్థలాలను కేటాయించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు , సౌకర్యాలతో ఆ కాలనీని అభివృద్ధి చేయాలని అన్నారు. కాలనీ నిర్మాణ బాధ్యతను గృహనిర్మాణ శాఖకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 2 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు.