యుద్ద ప్రాతిప‌దిక‌న పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ‌ ప‌నులు

ప్రాజెక్ట్ ను సందర్శించిన పీపీఏ సిఈఓ సంజీవ్ నోహ్రా

పోలవరం : పోలవరం ప్రాజెక్ట్ లో కీలకమైన ఎర్త్ కం రాక్ ఫిల్ (ఈ సి ఆర్ ఎఫ్ ) డ్యామ్ నిర్మాణం జరుగుతున్న తీరు, నాణ్యత పట్ల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సంజీవ్ వోహ్రా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే వేగం, నాణ్యతను కొనసాగిస్తూ వర్షాకాలంలో వానలు అంతగా లేని సమయాన్ని సద్వినియోగం చేసుకుని పనులు పూర్తి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు , నిర్మాణ సంస్థ ఎంఈఐఎల్ ప్రతినిధులకు సూచించారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నాయని, అందువల్లే తానూ నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రాజెక్టును సందర్శిస్తున్నానని చెప్పారు. గతవారం పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన వోహ్రా మరోమారు ప్రాజెక్ట్ ను సందర్శించారు. ఆయనతో పాటు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చీఫ్ ఇంజనీర్ రమేష్ కుమార్, ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్ట్ ఎస్ ఈ పీ రామచంద్ర రావు, డీఈఈలు డి. శ్రీనివాస్, బాలకృష్ణ, పీపీఏ లో సాంకేతిక అంశాల సమన్వయ అధికారి కెవిఎమ్ భాస్కరరావు , ఎం ఈ ఐ ఎల్ పోలవరం ప్రాజెక్ట్ జనరల్ మేనేజర్ ఏ గంగాధర్, డీజీఎం ఉన్నారు..

ప్రాజెక్టులోని ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ (ఈ సి ఆర్ ఎఫ్ ) నిర్మాణ ప్రాంతం గ్యాప్ 1, 2 , జి హిల్, జి డ్యాష్ హిల్ ను వోహ్రా సందర్శించారు. డిసెంబర్ నాటికి వర్షాలు పూర్తిగా తగ్గు ముఖం పడతాయని, ఈ లోగా వర్షం లేని సమయంలో పనులను ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలన్నారు సీఈఓ సంజీవ్ వోహ్రా. వర్షం లేనప్పుడే అవసరమైన మట్టి, రాయి, ఇసుక, సిమెంట్ మొదలైన వాటిని నిల్వ ఉంచుకుని పనులు చేపట్టాలని సూచించారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆర్ధిక వనరుల కొరత లేదని, కేంద్రం విడతల వారీగా నిధులు విడుదల చేస్తున్న నేపథ్యంలో నిర్మాణ సామాగ్రిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఈనెలలో విదేశీ నిపుణులు పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించే అవకాశం ఉన్నందున పనులను అనుకున్న మేర పూర్తి చేయాలని ఆదేశించారు సీఈఓ.

Leave A Reply

Your Email Id will not be published!