చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో పర్యటించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆదివారం చెన్నై మెట్రో ఫేజ్-2 నెట్‌వర్క్‌లో మొదటి రైలును ప్రారంభించారు. సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తో కలిసి గవర్నర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెట్రో ఫేజ్-2లోని పూనమల్లి-వడపళని కారిడార్‌లో మొదటి రైలును జెండా ఊపి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రారంభ ప్రయాణంలో కలిసి పీఎం, గవర్నర్,, సీఎం కలిసి పాల్గొన్నారు. నగరంలో విస్తరిస్తున్న ప్రజా రవాణా వ్యవస్థలో ఒక మైలురాయిగా నిలిచేలా, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న చెన్నై మెట్రో రైలు ఫేజ్-2 నెట్వర్క్ మొదటి రైలు అందుబాటులోకి వచ్చింది. దీంతో నగరవాసులకు ఇబ్బందులు తొలగి పోనున్నాయి. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ చెన్నైకి చేసిన మొదటి పర్యటనలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. ఈ పర్యటనలో ప్రధాని జాతీయ రహదారులు, రైల్వేలు , సముద్ర సంబంధిత మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.
అంతకు ముందు ప్రధాని మోదీ చెన్నై విమానాశ్రయానికి చేరుకోగా గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ , సీఎం విజయ్ ఆయనకు స్వాగతం పలికారు. మంత్రులు, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి, బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ , ఇతర నాయకులు ప్రధానికి స్వాగతం పలికేందుకు హాజరయ్యారు. అనంతరం ప్రధాని మోదీ , సీఎం విజయ్ పోరూర్ బైపాస్ రోడ్ మెట్రో స్టేషన్‌ను సందర్శించి, ప్రారంభ సేవను జెండా ఊపి ప్రారంభించే ముందు అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. మెట్రో నెట్వర్క్, కొత్త రైళ్ల నిర్వహణ ఏర్పాట్ల గురించి ప్రధాని అధికారుల నుండి వివరంగా అడిగి తెలుసుకున్నారు. కొత్తగా నిర్మించిన పూనమల్లి-వడపళని కారిడార్ రూ. 750 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడింది. ఈ కొత్త మార్గంలో సేవల మొదటి దశలో మెట్రో రైళ్లు 11 స్టేషన్లలో ఆగుతాయి.
రైలు ఎక్కే ముందు, ప్రధాని మోదీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ద్వారా చెల్లింపు చేసి టికెట్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి విజయ్‌తో కలిసి పోరూర్ బైపాస్ రోడ్ మెట్రో స్టేషన్ నుండి పూనమల్లి వరకు ప్రయాణించారు. ఈ ప్రారంభ ప్రయాణ సమయంలో, అధికారులు మెట్రో వ్యవస్థ పనితీరును వివరించడంతో పాటు, కొత్త సేవకు సంబంధించిన వివరాలను ప్రధానమంత్రికి తెలియ జేశారు. రైలులో ప్రయాణిస్తున్న విద్యార్థులు , కార్మికులతో కూడా ప్రధాని మోదీ ముచ్చటించారు.