క్విడ్ ప్రో కో కేసులో జగన్ పై హైకోర్టులో ఈడీ పిటిషన్
రోజూ వారీగా విచారణ చేపట్టాలని కోరిన దర్యాప్తు సంస్థ
అమరావతి : ఏపీ మాజీ సీఎం , వైసీపీ బాస్ జగన్ మోహన్ రెడ్డికి ఝలక్ ఇచ్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. క్విడ్ ప్రో కో కేసులో జగన్ విచారణను రోజు వారీగా చేపట్టాలని ఈడీ కోరుతోంది. మాజీ ఏపీ ముఖ్యమంత్రి రోజువారీ విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ సంస్థ తెలంగాణ హైకోర్టులో కొత్త పిటిషన్‌ను దాఖలు చేసింది. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి, ఇతరులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద దాఖలు చేసిన కేసుల్లో, విచారణను వేగవంతం చేయాలని, రోజువారీ విచారణ జరపాలని , నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరయ్యేలా చూడాలని కోరుతూ ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. మాజీ మంత్రి వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో హవాలా నగదు లావాదేవీల ఆరోపణలపై విచారణ కోసం కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసిన కొద్ది రోజులకే, దశాబ్దం క్రితం నమోదైన ‘క్విడ్ ప్రో కో’ కేసులో జగన్ మోహన్ రెడ్డి , ఇతర నిందితుల విచారణను వేగవంతం చేయాలని, వారు రోజువారీ విచారణకు హాజరయ్యేలా చూడాలని ఈడీ అధికారులు కోరారు.
సంచలనాత్మకమైన ఈ ‘క్విడ్ ప్రో కో’ కేసులో విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని , మాజీ ముఖ్యమంత్రి రోజువారీ విచారణకు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈడీ అధికారులు తెలంగాణ హైకోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. ఆర్థిక నేరాలు ఒక ప్రత్యేక వర్గానికి చెందినవని, వాటిని భిన్నమైన దృక్పథంతో పరిష్కరించాలని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని ఈడీ ఈ సందర్భంగా గుర్తు చేసింది. లోతైన కుట్రలు , భారీగా ప్రజాధనం దుర్వినియోగం కావడం వంటి అంశాలతో కూడిన ఆర్థిక నేరాలను తీవ్రంగా పరిగణించాలని, దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే , దేశ ఆర్థిక ఆరోగ్యంపై తీవ్ర ముప్పు కలిగించే తీవ్రమైన నేరాలుగా వీటిని చూడాలని ఈడీ పేర్కొంది. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద కార్పొరేట్ సంస్థలు , వ్యక్తులకు అనుకూలంగా వ్యవహరించడం, దానికి ప్రతిఫలంగా జగన్ మోహన్ రెడ్డి , ఆయన కుటుంబ సభ్యుల కంపెనీలలో భారీ పెట్టుబడులు రావడం వంటి ‘క్విడ్ ప్రో కో’ ఒప్పందాలపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ల ఆధారంగా, దాదాపు పదేళ్ల క్రితమే ఈడీ జగన్ రెడ్డితో పాటు మరో 73 మందిపై విచారణను ప్రారంభించారు.
