న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా బ్లాక్ సమావేశాన్ని తిరస్కరించడానికి గల కారణాన్ని వెల్లడించారు. తనను కలవాలన్న ఇండియా బ్లాక్ నాయకుల అభ్యర్థన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. చట్టానికి అనుగుణంగా ఫిర్యాదులను వింటుందని, ఉపశమనం పొందవలసిన వారికి అది అందేలా చూస్తుందని భారత ప్రధాన న్యాయమూర్తి అన్నారు. తనను కలవాలన్న నాకు వారి లేఖ నిన్న అందింది . నిన్న రాత్రి దానికి సమాధానం ఇచ్చాను. ఆ లేఖపై మొన్న తేదీ ఉంది, కానీ నేను అందుబాటులో లేక పోవడంతో అది నాకు నిన్న అందింది. నా సమాధానంలో నేను కొన్ని కారణాలు తెలియజేసి, వారిని కలవలేనని చెప్పాను. ఆ లేఖలోని విషయాల గురించి వారిని అడగమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. నేను దాని గోప్యతను కాపాడానని చెప్పారు. సుప్రీంకోర్టు తలుపులు అందరికీ తెరిచే ఉంటాయి. వారు సాధారణ పౌరులైనా లేదా ఎన్నికైన సభ సభ్యులైనా ఎవరైనా పిటిషన్ దాఖలు చేయవచ్చు. భారతదేశంలోని ప్రతి పౌరుడికి మమ్మల్ని ఆశ్రయించే హక్కు ఉంది. మేము చట్టానికి అనుగుణంగా వారి ఫిర్యాదులను వింటామన్నారు.
ఉపశమనం పొందడానికి అర్హులైన వారికి అది అందేలా చూస్తామని తెలిపారు. సుప్రీంకోర్టుకు ప్రణాళికాబద్ధమైన యాత్రకు ముందు, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల ఇండియా’ కూటమి సమావేశం కోసం చేసిన అభ్యర్థనను సీజేఐ సూర్యకాంత్ తిరస్కరించారు. బదులుగా పిటిషన్ ద్వారా కోర్టును ఆశ్రయించమని వారికి సలహా ఇచ్చారు. నివేదికల ప్రకారం ప్రతిపక్ష నాయకులు లేవనెత్తాలని అనుకుంటున్న అంశాలు ఇప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని, వాటిపై విచారణ జరుగుతోందని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు. పరిపాలనా స్థాయిలో ఒక రాజకీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధి బృందాన్ని ఈ విధంగా కోర్టు కలవలేదని సీజేఐ చెప్పినట్లు తెలిసింది. పిటిషన్లను విచారించి, తీర్పులు ఇవ్వడమే న్యాయవ్యవస్థ పాత్ర అని ఆయన నొక్కిచెప్పినట్లు సమాచారం.
