న్యూఢిల్లీ : ఈ దేశంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉందని దానిని కూడా హరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు ప్రముఖ ఉద్యమకారిణి నేహా బోరా. బలవంతపు ‘పీస్ బాండ్ల పేరుతో సంతకాలు తీసుకోవడాన్ని ఖండించారు. ఇటువంటి పీస్ బాండ్లపై సంతకాలు చేసే పద్ధతిని సాధారణీకరించే ప్రక్రియలో భాగం కాదని నేహా బోరా స్పష్టం చేశారు. ఇలాంటి పీస్ బాండ్లపై సంతకం చేయడం అంటే, ప్రజాస్వామ్యబద్ధంగా భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును వదులు కోవడంతో సమానమని ఆమె పేర్కొన్నారు. శనివారం నాడు న్యూఢిల్లీలోని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా ఇతర ప్రతినిధులతో కలిసి మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగం పౌరులకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును కల్పిస్తుండగా, కార్యనిర్వాహక వ్యవస్థ (ప్రభుత్వం/అధికార యంత్రాంగం) పీస్ బాండ్లను అమలు చేయడం అనేది ఒక ప్రధాన వైరుధ్యం అని ఆమె ఎత్తిచూపారు.
ప్రజాస్వామ్య నిరసనలను అణచి వేయడానికి ఈ పీస్ బాండ్లను ఒక ఆయుధంగా వాడుతున్నారని నేహా బోరా ఆరోపించారు. ఒకవైపు రాజ్యాంగం మనకు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును ఇస్తుంది. మరోవైపు, శాంతికి భంగం కలిగిస్తున్నామనే నెపంతో ప్రజలను నిర్బంధించడానికి ఈ పీస్ బాండ్లను ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 16న మండి హౌస్ వద్ద నిరసన చేపట్టిన 10 నిమిషాలకే మమ్మల్ని అదుపులోకి తీసుకుని, శాంతికి భంగం కలిగించామని చెప్పారు. ప్రజాస్వామ్య నిరసనలను అణచి వేయడానికి పీస్ బాండ్లను ఒక ఆయుధంగా మారుస్తున్నారు. కాబట్టి, ఇలాంటి పీస్ బాండ్లపై సంతకం చేయడం అనేది మాకు నైతికంగా తప్పు. ఇది మా ప్రజాస్వామ్య హక్కును, అంటే భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కును వదులు కోవడంతో సమానం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇటువంటి శాంతి ఒప్పందాలను సవాలు చేయడంపై ఆలోచిస్తామని అన్నారు.
