అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం తుపానుగా మారే అవకాశమున్న నేపథ్యంలో రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల అధికారులు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. తుపాను ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్‌తో మంత్రి ఫోన్లో మాట్లాడి తుపాను ప్రభావం, సముద్రంలో ఉన్న మత్స్యకార బోట్ల పరిస్థితి, తీరప్రాంత జిల్లాల్లో చేపట్టిన ముందస్తు చర్యలపై సమీక్షించారు. భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ నెల 26 నాటికి తుపాను ఏర్పడి, 28 నాటికి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపించే అవకాశమున్న నేపథ్యంలో అధికారులు ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించ రాదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 30,043 మత్స్యకార బోట్లలో 29,952 బోట్లు హార్బర్లు, ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల్లో సురక్షితంగా ఉండగా, మరో 91 బోట్లు సముద్రంలో ఉన్నట్లు అధికారులు మంత్రికి వివరించారు.
వీటిలో విశాఖపట్నం జిల్లాలో 37, అనకాపల్లిలో 1, కాకినాడలో 1, కృష్ణా జిల్లాలో 20, బాపట్ల జిల్లాలో 32 బోట్లు ఉన్నట్లు తెలిపారు. సముద్రంలో ఉన్న 91 బోట్లలో 72 మెకనైజ్డ్, 19 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ బోట్లన్నీ వీలైనంత త్వరగా సురక్షితంగా తీరానికి చేరుకునేలా పటిష్ఠ చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. మత్స్యకార సంఘాలు, బోటు యజమానులు, హార్బర్ అధికారులు, కోస్ట్‌గార్డ్, మెరైన్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సముద్రంలో ఉన్న ప్రతి బోటు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌కు 1,053 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉందని, రాష్ట్రంలోని 12 తీరప్రాంత జిల్లాల పరిధిలో 555 సముద్ర మత్స్యకార గ్రామాలు, 350 చేపల ల్యాండింగ్ కేంద్రాలు, ఉన్నాయని తెలిపారు. భారత వాతావరణ శాఖ ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులందరూ తమ పడవలతో తక్షణమే సురక్షితంగా తీరానికి చేరుకోవాలని సూచించారు.
రాష్ట్రం లోని అన్ని తీరప్రాంత జిల్లాల్లో జిల్లా మత్స్యశాఖ అధికారులు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ రామశంకర్ నాయక్ మంత్రికి వివరించారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా చూడాలని, తీరప్రాంత గ్రామాల్లో తుపాను హెచ్చరికలపై విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల తదితర తీరప్రాంత జిల్లాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. సముద్రంలో అలల ఉద్ధృతి, బలమైన గాలుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని బోట్లు, వలలు, ఇతర మత్స్యకార సామగ్రిని సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకునేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మరోవైపు తుపాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున రైతులు కూడా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.
