శ్రీ కార్తీక్ దర్శకత్వంలో ‘తార’గా రుక్మిణి వసంత్
సైన్స్ ఫిక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు టాక్
హైదరాబాద్ : ప్రముఖ నటి రుక్మిణి వసంత్ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. శ్రీ కార్తీక్ దర్శకత్వంలో రాబోయే చిత్రంలో ‘తార’గా రుక్మిణి వసంత్ రానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా మూవీ మేకర్స్ ధ్రువీకరించారు. దర్శకుడు శ్రీ కార్తీక్ రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామాలో రుక్మిణి వసంత్ ‘తార’ అనే పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రంలో ఆమెతో పాటు దేవ్ రామ్నాథ్ , వినాయక్ వైద్యనాథన్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన ప్రకటన వీడియోను విడుదల చేసింది. ఇందులో దర్శకుడు శ్రీ కార్తీక్ నటులు దేవ్ రామ్నాథ్, వినాయక్ వైద్యనాథన్ కలిసి, సినిమాలో ‘తార’ అనే పాత్రను ఎలా రూపొందించాలో చర్చిస్తుండగా, రుక్మిణి వసంత్ ఆ పాత్రలోకి ఎంట్రీ ఇస్తారు. శ్రీ కార్తీక్ గత చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’) తర్వాత వస్తున్న ఈ కొత్త సినిమా, టైమ్-ట్రావెల్ మిస్టరీ , తల్లి-కొడుకుల మధ్య ఉండే భావోద్వేగ బంధం నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ డ్రామా.
శ్రీ కార్తీక్ దర్శకత్వంలో వస్తున్న రెండో చిత్రం ఇది. దీనిని సిరిని సినీ కార్పొరేషన్ , మ్యాడ్బాయ్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తుండగా సాయికృష్ణ గద్వాల్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమా నిర్మాణ దశలో జరిగే విశేషాలను తెలియజేస్తూ మ్యాడ్బాయ్స్ సంస్థ ఇన్స్టాగ్రామ్లో ప్రత్యేకంగా ఒక డాక్యు-డ్రామా సిరీస్ను కూడా తీసుకు రానుంది. ఈ చిత్రానికి ఇంకా పేరు ఖరారు చేయాల్సి ఉంది. ఇక రుక్మిణి వసంత్ గురించి చెప్పాల్సి వస్తే తను విలక్షణ పాత్రలను ఎంచుకుంటున్నారు. దక్షిణ భారతీయ సినీ నటిగా గుర్తింపు పొందారు. కన్నడ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆమె తెలుగు, తమిళ చిత్రాల్లోనూ నటించారు. ముఖ్యంగా సప్త సాగరదాచే ఎల్లో, భైరతి రణగల్, కాంతార- చాప్టర్ 1 సినిమాలతో మంచి పేరు సంపాదించారు. తన పూర్తి పేరు రుక్మిణి వసంత్ వేనుగోపాల్. డిసెంబర్ 10, 1996లో పుట్టారు. తన వయసు 29 ఏళ్లు. బెంగళూరులో పుట్టారు.
