వాషింగ్టన్ : అధ్యక్ష పదవిపై ట్రంప్‌ను మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా విమర్శించారు. మధ్యంతర ఎన్నికలలో ఓటర్లు తమ గళాన్ని వినిపించాలని కోరారు. ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్‌లో జరిగిన ఒక ర్యాలీలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పెరుగుతున్న ధరలకు ఇరాన్‌తో ఆయన పరిపాలన సాగిస్తున్న యుద్ధం, సుంకాలు, వలస విధానాలపై కఠిన చర్యలే కారణమని మండిపడ్డారు. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలను వ్యవస్థలో ఒక విరుగుడు అని అభివర్ణించారు. ఒహియో గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న డెమొక్రాట్ అమీ ఆక్టన్, యూఎస్ సెనేట్‌కు డెమొక్రాటిక్ అభ్యర్థి అయిన మాజీ సెనేటర్ షెరాడ్ బ్రౌన్‌లకు మద్దతుగా ఒబామా క్లీవ్‌ల్యాండ్ పబ్లిక్ ఆడిటోరియంలో ప్రసంగించారు. బ్రౌన్ ఆయనను పరిచయం చేశారు. పెరుగుతున్న ధరలకు ఈ ప్రభుత్వ చర్యలే ప్రత్యక్ష కారణం అని ఒబామా అన్నారు.
ఎవరూ కోరని, ఎవరూ ఓటు వేయని అనవసరమైన యుద్ధాన్ని అధ్యక్షుడు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఇరాన్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ ఒబామా ఇలా అన్నారు. నేను ఒక ఒప్పందాన్ని కుదిర్చాను, దానిని అందరూ అంగీకరించారు. దానివల్ల ఇరాన్ అణ్వాయుధాలు పొందకుండా నిరోధించబడింది. అందుకే ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవు. దీనికోసం నేను క్షిపణిని ప్రయోగించాల్సిన అవసరం రాలేదు. నేను కేవలం దౌత్యం ద్వారానే ఈ పని చేయగలిగాను అని చెప్పారు ఒబామా. ఏడు నెలల తర్వాత ఆయన ఇలా అన్నారు మన మిత్రదేశాలు, మన స్థావరాలపై దాడులు జరిగాయి, అమెరికన్లు చంపబడ్డారు, వందలాది మంది అమెరికన్లు గాయపడ్డారు, మన క్షిపణుల నిల్వలు తగ్గిపోయాయి. ప్రపంచ మార్కెట్‌కు చమురు వెళ్లే హోర్ముజ్ జలసంధిపై ఇప్పుడు ఇరాన్‌కు వీటో అధికారం ఉందన్నారు ఒబామా.
