ప్ర‌జాస్వామ్యం ప్ర‌మాదంలో ఉంది : కేసీ వేణుగోపాల్

ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయండి

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైంద‌ని అన్నారు ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్. నవంబర్ 1న జరిగే ర్యాలీలో పాల్గొనాలని భారతీయులకు పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కూటమి నిర్వహించనున్న ఈ ర్యాలీని చలో దిల్లీ, ఓటు బచావో, దేశ్ బచావో అని పేర్కొన్నారు. రోజు రోజుకు ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియలో జరిగినట్లు ఆరోపించ బడుతున్న అక్రమాలపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ఇండియా’ కూటమి నవంబర్ 1న నిర్వహించనున్న ర్యాలీలో ప్రతి భారతీయుడు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాల నుండి 13 కోట్ల పేర్లను తొలగించారని, అనేక రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల విషయంలో భారీ మోసం జరుగుతోందని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మా ఓట్లు దొంగిలించ బడుతున్నాయని పేర్కొన్నారు. తాము దీనిపై వివరణ కోరితే మాపై లాఠీఛార్జ్ చేసి, మమ్మల్ని నిర్బంధిస్తున్నారని ఆరోపించారు. తాము భయపడి మౌనంగా ఉండబోమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తాం అని ప్ర‌కటించారు వేణుగోపాల్ . లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ పోరాటానికి ముందుండి నాయకత్వం వహిస్తున్నారని, ఆయన నిర్భయంగా ప్రశ్నలు అడుగుతూ అధికారంలో ఉన్నవారిని జవాబుదారీగా మారుస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు పేర్కొన్నారు. ఇప్పుడు మనమందరం ఆయనతో రాహుల్ గాంధీతో నిలబడి ఈ పోరాటంలో చేరాల్సిన సమయం వచ్చింది అని ఆయన అన్నారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ మోదీ ప్రభుత్వాన్ని జవాబుదారీగా నిలబెడుతూ ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఇండియా బ్లాక్ పార్టీల ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీ, మార్చ్ జరగనుందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!