ఓటు దొంగ‌త‌నంపై ‘ఇండియా కూట‌మి’ యుద్దం

'ఓటు బచావో, దేశ్ బచావో' నినాదంతో దద్దరిల్లిన రాజధాని

న్యూఢిల్లీ : ఓటు హక్కును అపహరిస్తే ఊరుకోం. జ్ఞానేశ్ కుమార్ బేషరతుగా రాజీనామా చేయాల్సిందే… పాలకుల అణచివేతకు తలవంచేది లేదు అంటూ ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో భారీ ర్యాలీ చేప‌ట్టారు. రాజ‌ధాని ఢిల్లీలోని మింటో రోడ్ నుంచి రామ్‌లీలా మైదానం వరకు నినాదాల‌త‌తో హోరెత్తించారు. దాదాపు 10 ల‌క్ష‌ల మందికి పైగా రాం లీలా మైదానంకు వ‌చ్చి ఉంటార‌ని అంచ‌నా. అంద‌రూ అనుకున్నట్లుగానే అక్షరాలా ప్రజాస్వామిక రణరంగాన్ని తలపిస్తూ అక్టోబర్ నిరసనల జ్వాల నవంబర్ 1 నాటికి మహా ఉప్పెనలా మారింది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (సర్) పేరుతో కోట్లాది మంది పౌరులను ఓటర్ల జాబితా నుంచి దొడ్డిదారిన తొలగించిన ‘ఓటు చోరీ’కి వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణ రాజీనామా డిమాండ్‌తో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి తలపెట్టిన ‘చలో ఢిల్లీ’ మహా ప్రదర్శనతో న్యూఢిల్లీ నిశ్శబ్దాన్ని తెంచుకుని మహా గర్జన చేసింది.

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, ప్రియాంక గాంధీ వంటి దిగ్గజ నాయకులందరూ ఓపెన్-టాప్ బస్సుల్లో జాతీయ జెండాలను ప‌ట్టుకుని ప్రజలకు అభివాదం చేస్తూ మింటో రోడ్ – కన్నాట్ ప్లేస్ జంక్షన్ నుంచి రామ్‌లీలా మైదానానికి కదిలిన దృశ్యం​ ‘రాజధానిని కుదిపేసిన తిరుగుబాటు’కు సజీవ సాక్ష్యంగా నిలిచింది. ఈ చారిత్రాత్మక మార్చ్‌ను దెబ్బ తీయడానికి పాలకపక్షం, అధికార యంత్రాంగం పన్నని కుట్ర లేదు. కన్నాట్ ప్లేస్‌లో వ్యాపారులకు నష్టం జరుగుతోందనే నెపంతో దుకాణాలను బలవంతంగా మూసి వేయించడం నుంచి, పోలీసు బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ద్వారా ఆంక్షలు విధించడం వరకు ప్రతీ మార్గాన్నీ అడ్డుకోవాలని చూశారు.

ఢిల్లీ పోలీసులు మైదానంలో కేవలం 30,000 నుంచి 40,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చినా… ఆ నిబంధనల కోటలను బద్ధలు కొడుతూ, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన దాదాపు 10 లక్షల మందికి పైగా కార్యకర్తలు, ‘పీపుల్ అగైనెస్ట్ సర్’, విద్యార్థి సంఘం (ఎస్.ఎఫ్.ఐ) శ్రేణులు రామ్‌లీలా మైదాన పరిసరాలను జనసముద్రంగా మార్చేశారు. ఈ క్రమంలో నిరసనను బలహీన పరిచేందుకు అధికార పార్టీ శ్రేణులు పోటీ నిరసనలు, ప్రకటనల డ్రామాలకు తెరలేపినా… రామ్‌లీలా మైదానంలో ఎగిసిన త్రివర్ణ పతాకాల ప్రజా ప్రవాహం ముందు అవన్నీ కొట్టుకు పోయాయి. మైదానం వేదికగా నాయకులు పాలకుల ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై నిప్పులు చెరిగారు. ఉత్తరప్రదేశ్‌లోనే 1.27 కోట్ల మంది అర్హుల ఓట్లను అక్రమంగా గల్లంతు చేశారని అఖిలేష్ యాదవ్ మండిపడగా, “రాబోయే ప్రజా సునామీ జ్ఞానేశ్ కుమార్‌ను, ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన మోదీ-అమిత్ షాలను కొట్టుకుపోయేలా చేస్తుంది’ అని పవన్ ఖేరా హెచ్చరించారు.

ప్రతిపక్షాలు జరిపిన ‘సాంకేతిక మోక్ ఇంపీచ్‌మెంట్’ (సమగ్ర అభిశంసన) సభ తర్వాత, ఆదివారం నాటి ఈ ‘ప్రజా పార్లమెంట్’ పాలకుల గద్దెలను కుదిపేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ఇతర పౌర సంఘాలు క్షేత్రస్థాయిలో సంఘీభావం తెలపడంతో ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ పోరాటం మాత్రమే కాదని, ప్రతి భారతీయుడి రాజ్యాంగ హక్కుల కాపలా పోరాటమని స్పష్టమైంది .‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే మా అంతిమ లక్ష్యం. ఈ సమరం ఒక్క ర్యాలీతో ఆగిపోదు’ అని నాయకులు సభా ముఖంగా ప్రతిజ్ఞ చేశారు. ముళ్లకంచెలు, పోలీసు వాహనాలు, కెమెరాల నిఘా కళ్ల మధ్య హోరెత్తిన ఈ ‘ఓటు బచావో, దేశ్ బచావో’ మహా గర్జన… కోట్లాది పౌరుల ఓటు హక్కును హరించే ఏ నియంతృత్వ శక్తైనా ప్రజా ఉప్పెన ముందు తలవంచక తప్పదని స్పష్టం చేసింది.

Leave A Reply

Your Email Id will not be published!