వాడపల్లి : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగాయి. ఆశ్వయుజ బహుళ సప్తమి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వైదిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 9.15 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్యాహ వచనం, పంచామృత మండప ఆరాధన, మహాస్నపనం, ప్రధాన హోమాలు నిర్వహించారు. అనంతరం లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీనివాస కల్యాణాన్ని వేద మంత్రోచ్ఛారణల నడుమ సంప్రదాయ బద్ధంగా జరిపించారు. దిగ్దేవతా బలిహరణ, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 5.30 గంటలకు స్వస్తివాచనం, ప్రధాన హోమాలు, స్వామివారికి విశేషార్చన, చతుర్వేద స్వస్తి, దిగ్దేవతా బలిహరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా రాత్రి 7.35 గంటలకు యోగ నారసింహ అలంకరణలో శ్రీ స్వామి వారిని సింహ వాహనంపై అధిష్ఠింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య సింహ వాహన సేవ కన్నుల పండువగా సాగింది. స్వామి వారి దివ్య మంగళ రూపాన్ని దర్శించు కునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో వాడపల్లి క్షేత్రం భక్తజన సందోహంతో సందడిగా మారింది.
ఇదిలా ఉండగా వాడవల్లి పుణ్యక్షేత్రంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వచ్చారు.
