33 ఏళ్ల త‌ర్వాత మెగాస్టార్ ‘ముఠా మేస్త్రీ’ రీ రిలీజ్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ముఠా మేస్త్రి’ చిత్రం త్వరలో మళ్లీ విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన ఎవరైనా ‘ముఠా మేస్త్రి’ని ఎలా మర్చిపోగలరు? ఈ చిత్రంలో ఆయన ప్రదర్శించిన మాస్ అప్పీల్, దానికి తోడైన రాజకీయ నేపథ్యం.. ఈ సినిమాను కేవలం బ్లాక్‌బస్టర్‌గా మార్చడమే కాకుండా, చిరంజీవి కెరీర్‌లోనే అత్యుత్తమ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిపాయి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో 1993 జనవరి 17న విడుదలైన ఈ చిత్రం సుమారు 33 ఏళ్ల తర్వాత నవంబర్ 22న మళ్లీ థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. దీంతో మెగాస్టార్ అభిమానులకు పెద్ద పండుగ లాంటి వార్త అందింది. ఈ పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. మెగాస్టార్ మాస్ మ్యాజిక్ ఇప్పుడు మీ ముందుకు రానుంది. ‘బాస్’ స్వాగ్, అసమానమైన మాస్ పవర్. మెగాస్టార్ ను మరోసారి వెండితెరపై అద్భుతమైన రూపంలో చూసేందుకు సిద్ధం అవ్వండి అని.

నవంబర్ 22న ‘ముఠా మేస్త్రి’ 4కె వెర్షన్‌లో తిరిగి రాబోతోంది. పాత జ్ఞాపకాలను, ఈలల హోరును, ఆ మర్చిపోలేని ‘మెగాస్టార్ మేనియా’ను మళ్లీ అనుభవించండి అని కోరింది. అంటే ‘ముఠా మేస్త్రి’ చిత్రం 4K రీ-మాస్టర్డ్ వెర్షన్‌లో మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది అన్న‌మాట‌. ఈ చిత్రంలో చిరంజీవి సుభాష్ చంద్ర బోస్ (బోస్) పాత్రలో మీన బుజ్జమ్మ పాత్రలో , రోజ కల్పన పాత్రలో , మన్సూర్ అలీ ఖాన్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో, బ్రహ్మానందం కూలీ పాత్రలో , శరత్ సక్సేనా ఆత్మ రామ్ పాత్రలో , గుమ్మడి ముఖ్యమంత్రి పాత్రలో , కోట శ్రీనివాసరావు, జె.వి. సోమయాజులు, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. ఇందులో ఉండే హాస్య సన్నివేశాలు, అలాగే చిరంజీవి, మీన , రోజాల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. మెగా అభిమానుల కోసం ఈ చిత్రాన్ని నవంబర్ 22న థియేటర్లలో తిరిగి విడుదల చేయనున్నారు.

Leave A Reply

Your Email Id will not be published!