అప్ర‌మ‌త్తంగా ఉండండి స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టండి

రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి సీఎం చంద్ర‌బాబు

అమ‌రావ‌తి : మురసు తుఫాను సన్నద్ధతపై మరోమారు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రం నుంచి స‌మీక్షించారు. ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు సహా 45 వేల మంది క్షేత్రస్థాయి సిబ్బందితో టెలి కాన్ఫరెన్సులో మాట్లాడారు. అర్నబ్ తుఫానుతో పోలిస్తే మురసు తీవ్రత తక్కువే అయినా ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకూ వివిధ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. పలనాడు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. నాగార్జున సాగర్, పులిచింతల, బుడమేరు క్యాచ్ మెంట్ ఏరియాలకు వరద ప్రవాహాలు వస్తాయన్నారు సీఎం . బుడమేరు వద్ద ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . మురసు తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఇప్ప‌టికే వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింద‌న్నారు.

ప్రతీ గంటకూ రియల్ టైమ్ లో తుఫాను హెచ్చరికలను జారీ చేయాల‌ని ఆదేశించారు సీఎం. వరద ముంపు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను తుఫాను షెల్టర్లకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. తుఫాను ప్రభావంతో ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు నేల కూలే అవకాశం ఉంటుందని, అందుకు త‌గ్గ‌ట్టుగా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు. ఇవాళ రాత్రి 12 గంటల నుంచి రేపు రాత్రి 12 గంటల వరకూ తుఫాను ప్రభావం కోస్తాంధ్ర జిల్లాలపై ఉంటుందని హెచ్చ‌రించారు. 848 స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల పరిధిలో ఇది ఎక్కువ‌గా ప్ర‌భావం క‌లగించే ఛాన్స్ ఉంద‌న్నారు సీఎం. ముందస్తు జాగ్రత్తల కారణంగా ఆర్నబ్ సమయంలో చాలా వరకు ఇబ్బందులు తప్పించ గ‌లిగామ‌ని చెప్పారు. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూడటమే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు.

ఆస్తి నష్టం కూడా గణనీయంగా తగ్గించేగలిగితే… ప్రజల్లో భరోసా వస్తుందని పేర్కొన్నారు. 14,760 మైనర్ ఇరిగేషన్ చెరువుల్లోకి ప్రవాహాలు వచ్చే అవకాశం ఉంద‌ని, గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల‌ని సీఎం సూచించారు. బుడమేరుకు రేపు 30 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉంద‌న్నారు. జలవనరుల శాఖతో పాటు ఆయా జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ఎన్టీఆర్, పలనాడు, కృష్ణా, ప్రకాశం తదితర జిల్లాల్లో విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉంద‌ని ముంద‌స్తు హెచ్చ‌రించారు సీఎం. 5 వేల మంది సిబ్బందిని విద్యుత్ పునరుద్ధరణ కోసం వినియోగిస్తున్నాం అన్నారు. విద్యుత్ సరఫరా సమస్య తలెత్తిన చోట త్వరితగతిన విద్యుత్ పునరుద్దరించాలని ఆదేశించారు. గుండ్లకమ్మకు కూడా వరద ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని, పులిచింతల, ప్రకాశం బ్యారేజికి కూడా నీటి ప్రవాహాలు వస్తాయన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!