హైదరాబాద్ : ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు. సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ (తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ) పరిధిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు , ఏరియా ఆసుపత్రుల నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్ లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా జె. చోంగ్, ఎండీ గౌరవ్ ఉప్పల్, వివిధ జిల్లాల కమ్యూనిటీ హెల్త్ అధికారులు ,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆసుపత్రులు, వైద్య , నర్సింగ్ కళాశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని టీజీఎంఎస్ఐడీసీ ఎండీ గౌరవ్ ఉప్పల్ మంత్రికి వివరించారు. సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలో 9 ఆసుపత్రి భవనాల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. మరో 14 భవనాలు డిసెంబర్ నాటికి, ఇంకో 11 భవనాలు మార్చి 2027 నాటికి పూర్తవుతాయని ఆయన తెలిపారు. వీటితో పాటు మరో 45 భవనాల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందని వెల్లడించారు.
పూర్తయిన 9 భవనాల్లో అవసరమైన పరికరాలు, ఫర్నిచర్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ , మార్చి నెలల్లో పూర్తయ్యే భవనాలకు అవసరమైన పరికరాలు, ఫర్నిచర్ కొనుగోలు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు. సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలో నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలను వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, జిల్లాల్లోని ఏరియా ఆసుపత్రులు , కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల పనితీరుపై ఆరా తీశారు. తమ జిల్లాల పరిధిలోనే కనీసం 90 శాతం మంది రోగులకు వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడంలో ఈ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఆరోగ్య శాఖలో వైద్యులు, నర్సులు, సాంకేతిక నిపుణులతో సహా సుమారు 15,000 పోస్టులను భర్తీ చేశామని తెలిపారు.
సెకండరీ హెల్త్ కేర్ డైరెక్టరేట్ పరిధిలోని ఆసుపత్రుల కోసం ఇటీవల 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించినట్లు గుర్తు చేశారు. అవసరమైన పరికరాలన్నింటినీ సమకూరుస్తున్నామని, కొత్త భవనాలను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత డీసీహెచ్‌ఓలు, ఆసుపత్రి సూపరింటెండెంట్ల పైనే ఉందని మంత్రి నొక్కి చెప్పారు. ‘ఎల్ నినో’ పరిస్థితుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆసుపత్రులలో నీరు, విద్యుత్ , ఇతర సదుపాయాలకు సంబంధించి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
