రెవెన్యూ, ఫారెస్ట్ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం

ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి పొంగులేటి

హైద‌రాబాద్ : రెవెన్యూ, అటవీ (ఫారెస్ట్) భూముల సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. డాక్ట‌ర్ బి.ఆర్‌. అంబేద్క‌ర్ సచివాలయంలో రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు , సర్వే, సెటిల్‌మెంట్ అధికారులతో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడారు. రెండు విభాగాల స‌రిహ‌ద్దు వివాదాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు ఏమాత్రం నష్ట పోకూడదని అన్నారు. రెండు విభాగాలు పూర్తి సమన్వయంతో జాయింట్ సర్వేలు నిర్వహించాలని స్పష్టం చేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ విభాగాలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో సర్వేలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సర్వేలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రీయ పద్ధతుల సహాయంతో నిర్వహించి భూములకు స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలని సూచించారు.

శాస్త్రీయంగా సరిహద్దులను నిర్ధారించడం ద్వారా భవిష్యత్తులో తిరిగి ఎలాంటి వివాదాలు తలెత్తకుండా శాశ్వతంగా తెర పడుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో భూ పరిపాలనను మరింత బలోపేతం చేయడంలో భాగంగా సర్వే, సెటిల్‌మెంట్ , భూ రికార్డుల శాఖ ద్వారా ప్రభుత్వం సమగ్ర సంస్కరణలు అమలు చేస్తోందని వెల్లడించారు పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. భూ రికార్డులలో పూర్తి పారదర్శకత, ఖచ్చితత్వం తీసుకు రావడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పట్టుదలతో పనిచేసి దశాబ్దాల నాటి భూ వివాదాలకు త్వరితగతిన పరిష్కారం చూపాలని మంత్రి సూచించారు. ఈ స‌ర్వేకు క్షేత్ర‌స్దాయిలో రైతులు, ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని సూచించారు. జిల్లా, మండ‌ల స్జాయిలో రెవెన్యూ, అట‌వీ అధికారులు స‌మ‌న్వ‌యంతో క‌మిటీలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాల‌ని ఆదేశించారు.

ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్య‌ద‌ర్శి లోకేష్ కుమార్‌, స‌ర్వే- సెటిల్‌మెంట్ క‌మిష‌న‌ర్ రాజీవ్ గాంధీ హ‌నుమంతు, పిసిసిఎఫ్ విన‌య్‌కుమార్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!