బెంగళూరు : ఉన్మాది దాడిలో గాయపడిన బాధితురాలు గోపిక కోలుకుంటోందని అన్నారు మంత్రి ఎస్. సవిత. బెంగళూరులో చికిత్స పొందుతున్న తనను పరామర్శించారు. మంత్రి నారా లోకేశ్ మంచి వైద్యమందిస్తున్నారని, తాను త్వరలో స్కూల్ కూడా వెళ్లతానని, పదో తరగతి పరీక్షలు కూడా రాస్తానని ఆమె ఎంతో ఆత్మ స్థైర్యంతో చెబుతోందని తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సొంత బిడ్డ మాదిరిగా గోపిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. నిందితుడు హేమంత్ ను కాపాడడానికి జగన్ ప్రయత్నిస్తున్నాడని, కూటమి ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతో, ఆయనెప్పుడూ హంతకులను వెంటేసుకుంటా వస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోమహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధించినా అదే వారికి చివరి రోజని హెచ్చరించారు. పరామర్శించిన అనంతరం తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. గురువారం బాలికకు నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైందని, ప్రస్తుతం గోపిక ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోందని వైద్యులు తెలిపినట్లు మంత్రి వెల్లడించారు.
దాడికి గురైన విషయం తెలిసిన వెంటనే విద్యార్థినిని అనంతపురం నుంచి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రికి గ్రీన్ ఛానల్ ద్వారా వేగంగా తరలించి సకాలంలో వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. తనకు మెరుగైన వైద్యమందిస్తున్నారని, మంత్రి నారా లోకేశ్ కు విద్యార్థిని ధన్యవాదాలు తెలిపినట్లు మంత్రి సవిత సవిత వెల్లడించారు. తాను త్వరలో స్కూల్ కు వెళతానని, పదో తరగతి పరీక్షలు కూడా రాస్తానని విద్యార్థి గోపిక ఎంతో ఆత్మస్థైర్యంతో మాట్లాడుతోందని తెలిపారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రభుత్వ అధికారులు , ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున డాక్టర్ గంగాధర్ రెడ్డి బాలిక వైద్య సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు తమకు అండగా నిలిచి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ బాలిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారని మంత్రి సవిత వెల్లడించారు.
జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాలు చేస్తూ, హంతులను వెంటేస్తుకొస్తున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. డ్రైవర్ ను హత్య చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు తనయుడిని, రాప్తాడులో విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన నిందితుడిని జగన్ అండగా నిలుస్తూ వస్తున్నారన్నారు. తన లీగల్ టీమ్ తో రాప్తాడు నిందితుడిని కాపాడడానికి హైకోర్టులో పిల్ వేశారన్నారు. ప్రజల మాన, ప్రాణాలకంటే జగన్ కు హంతకులే ముఖ్యమన్నారు. రాప్తాడు నిందితుడిని చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. అరెస్టు చేయడానికి వెళ్లిన సమయంలోదాడి చేయడం వల్లే నిందితుడిపై పోలీసులు కాల్పులు జరపారన్నారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నామన్నారు. వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, వేధింపులకు పాల్పడినా అదే వారికి చివరి రోజని మంత్రి సవిత హెచ్చరించారు. మహిళలు, బాలికలపై ఎక్కడైనా దాడులు జరిగితే ప్రభుత్వం ఉపేక్షించబోదని మంత్రి సవిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి ముఠాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత తెలిపారు.