ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు
భారీగా తరలి వచ్చిన శ్రీ స్వామి వారి భక్త బాంధవులు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్తానం ఆధ్వర్యంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం 8.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివార్లను యాగశాలకు వేంచేపు చేసి వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యా హవచనం, పంచగ వ్యారాధన, రక్షా బంధనం, అన్నప్రానా యానం నిర్వహించారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా అభిషేకం చేశారు.
అనంతరం రాత్రి 7 గంటలకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర ప్రతిష్ట నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ.శరత్, ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ హరికృష్ణ, ఆర్జితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా దీపావళి పండుగ సందర్బంగా శ్రీ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆస్తానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు టీటీడీ అథారిటీ చైర్మన్ , ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర. ఈ సందర్బంగా సిఫారసు లేఖలు స్వీకరించడం జరగదని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల కోడ్ రాష్ట్రంలో కొనసాగుతున్నందున వీటిని తీసుకోవడం లేదన్నారు. డిసెంబర్ 3 తర్వాత పరిశీలిస్తామని పేర్కొన్నారు.