పాపియా సుల్తాన్ కు కీల‌క బాధ్య‌త‌ల అప్ప‌గింత

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం సువేందు అధికారి

కోల్ క‌తా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈరోజు వేదికపై నుండి ఒక ర్యాలీని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు, బీజేపీ ముస్లింల‌కు వ్య‌తిరేకం కాద‌ని ఆయ‌న ఆచ‌ర‌ణ‌లో నిరూపించారు. ముస్లిం మహిళా ఐపీఎస్ అధికారిణి “పాపియా సుల్తాన్”కు ఒక పెద్ద బాధ్యతను అప్పగించారు. ‘ఛోటా అంగారియా హత్యాకాండ’ కేసు దర్యాప్తును మీ చేతుల్లో పెడుతున్నామని ప్ర‌క‌టించారు. సిపిఐ(ఎమ్) నాయకులు ‘తపన్ ఘోష్’ ‘సుకుర్ అలీ’ ఎక్కడ దాక్కున్నా సరే, మీరు వారిని వెతికి పట్టుకొని బయటకు తీసుకు రావాలన్నారు. తాము వారిని జైలు లోపల చూడాలనని అనుకుంటున్నామన్నారు.

ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రస్తావించిన ఈ హత్యాకాండ జనవరి 4, 2001 న జరిగింది. ఆ సమయంలో సిపిఐ(ఎమ్) కార్యకర్తలు ఒక టీఎమ్‌సీ మద్దతుదారుడి ఇంటికి వెళ్లి ఆ కుటుంబంపై దాడికి తెగబడ్డారు, ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి సువేందు అధికారి స్వయంగా టీఎమ్‌సీ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఉన్నారు. తపన్ ఘోష్, సుకుర్ అలీ పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) నాయకులు. వీరు పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో పార్టీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పలు రాజకీయ హింసాకాండలు, పలు హత్య కేసులలో ప్రధాన నిందితులుగా వార్తల్లో నిలిచారు.

జనవరి 4, 2001న పశ్చిమ మిడ్నాపూర్‌లోని గర్బెటా పరిధిలోని ఛోటో అంగారియా గ్రామంలో ఓ తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యకర్త ఇంటిపై దాడి చేసి, నిప్పు పెట్టిన ఘటనలో ఐదుగురు టిఎంసి మద్దతుదారులు సజీవ దహనమయ్యారు. ఈ ఘోరకలికి తపన్ ఘోష్ (జిల్లా కమిటీ సభ్యుడు), సుకుర్ అలీ (గర్బెటా జోనల్ కమిటీ కార్యదర్శి)లే ప్రధాన సూత్రధారులని సీబీఐ పేర్కొంది. అయితే, తగిన ఆధారాలు లేకపోవడం, కీలక సాక్షులు మాట మార్చడంతో 2009లో స్థానిక కోర్టు వీరిద్దరితో పాటు ఇతర నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

నందిగ్రామ్ ‘ఆపరేషన్ సన్‌రైజ్’ (2007): 2007లో నందిగ్రామ్ భూసేకరణకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ సమయంలో, ఆ ప్రాంతాన్ని తిరిగి తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి సీపీఎం శ్రేణులు జరిపిన ‘ఆపరేషన్ సన్‌రైజ్’ హింసాకాండలో, క్షతగాత్రులను అపహరించిన కేసులో కూడా వీరిద్దరి పేర్లు ఉన్నాయి. ఆ సమయంలో నకిలీ పేర్లతో తప్పించుకోవడానికి ప్రయత్నించిన వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తదనంతరం వీరు బెయిల్‌పై విడుదలయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!