టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన మహమ్మద్ షమీ
13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు చెప్పిన క్రికెటర్
ఉత్తర ప్రదేశ్ : టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు మహమ్మద్ షమీ. 13 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు చెబుతున్నట్లు వెల్లడించాడు. 13 ఏళ్ల తన కెరీర్‌లో 64 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆయన, మొత్తం 229 వికెట్లు పడగొట్టి, భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆరవ పేసర్‌గా నిలిచారు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన 36 ఏళ్ల షమీ, ఇకపై వైట్-బాల్ (పరిమిత ఓవర్ల) క్రికెట్‌తో పాటు, ఫిట్‌నెస్‌ను బట్టి దేశవాళీ నాలుగు రోజుల మ్యాచ్‌లలోనూ కొనసాగుతానని తెలిపారు . అయితే వైట్-బాల్ ఫార్మాట్లలో తన ఆటను కొనసాగిస్తారు. తన అంతర్జాతీయ టెస్టు కెరీర్‌లో 64 మ్యాచ్‌లు ఆడిన షమీ మొత్తం 229 వికెట్లు సాధించారు. తన కంటే ముందు కపిల్ దేవ్ (434), జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (ఇద్దరూ 311), జవగళ్ శ్రీనాథ్ (236), జస్ప్రీత్ బుమ్రా (234) ఉన్నారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుకు దూరంగా ఉన్న 36 ఏళ్ల షమీ, తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు.
నేను తెల్లటి జెర్సీని (టెస్టు దుస్తులను) వదిలేస్తున్నాను, కానీ దానితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ఎప్పటికీ వదిలి పెట్టను. మొదటిసారి భారత టెస్టు జెర్సీని ధరించినప్పుడు, నా దేశం కోసం ఏదైనా చేయాలనే ఒకే ఒక్క కల ఉండేది. ఆ తర్వాత ప్రతి వికెట్, ప్రతి పోరాటం, ప్రతి గాయం , ప్రతి పునరాగమనం నాకు ఏదో ఒక పాఠాన్ని నేర్పాయి అని షమీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.
టెస్టు క్రికెట్ నాకు కేవలం ఒక ఫార్మాట్ మాత్రమే కాదు, నా జీవితంలో చాలా ప్రత్యేకమైన భాగం. నేడు, ఎంతో బాధతో, అదే సమయంలో ఎన్నో మధుర జ్ఞాపకాలతో టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను అని తెలిపారు.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా సహస్పూర్ అలీనగర్ గ్రామంలో ఉన్న తన ఫామ్‌హౌస్ నుంచి విడుదల చేసిన వీడియో సందేశంలో టెస్టు క్రికెట్‌లో గడిపిన కాలాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆ ప్రయాణం కఠిన శ్రమతో, అనేక ఒడిదుడుకులతో కూడుకున్నదని పేర్కొన్నారు. భారతదేశం తరపున 279వ టెస్ట్ క్యాప్ అందుకున్న షమీ, ఈ ఫార్మాట్ ఒక క్రికెటర్‌గా తన గుర్తింపును తీర్చిదిద్దిందని చెప్పాడు. షమీ 2013 నవంబర్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో తన టెస్ట్ అరంగేట్రం చేశాడు. అతను 27.71 సగటుతో 229 వికెట్లు పడగొట్టాడు, ఇందులో ఆరుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి.
