టీజీఎస్‌పీడీసీఎల్ డ్రోన్ లో డ్రోన్ టెక్నాలజీ

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన మేనేజింగ్ డైరెక్ట‌ర్

హైద‌రాబాద్ : విద్యుత్ పంపిణీ నెట్‌వర్క్‌ను ఆధునీకరించడం, విద్యుత్ అంతరాయాలను తగ్గించడం, నివారణ నిర్వహణను బలోపేతం చేయడం, ఉద్యోగుల భద్రతను పెంచడంపై దృష్టి సారించింది తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఎస్‌పీడీసీఎల్) . అంతే కాకుండా సేవ‌లు మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉండేందుకు గాను డ్రోన్ టెక్నాలజీని స్వీకరించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. సీఎండీ జితేష్ వి. పాటిల్ మార్గదర్శకత్వంలో క్షేత్రస్థాయిలో అధునాతన సాంకేతిక పరిష్కారాలను విస్తృతంగా అమలు చేయడానికి కంపెనీ చురుకైన చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రయత్నాలలో భాగంగా, ఆపరేషన్స్ , ప్రాజెక్ట్స్ &ఐటీ విభాగాలు నిర్వహించిన మూడు రోజుల సామర్థ్య పెంపు శిక్షణా కార్యక్రమంలో భాగంగా కళ్యాణ్ నగర్‌లోని స్కాడా కార్యాలయంలో ఒక ప్రత్యేక డ్రోన్ పైలట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు జరిగిన ఈ సమావేశంలో 35 మందికి పైగా ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

టీజీఎస్‌పీడీసీఎల్ ఒక పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి తన విద్యుత్ పంపిణీ మౌలిక సదుపాయాలను ఇప్పటికే తనిఖీ చేసింది. ఈ కార్యక్రమం కింద, 31,000 విద్యుత్ స్తంభాలను కవర్ చేస్తూ సుమారు 1,050 కిలోమీటర్ల 11 kV విద్యుత్ లైన్లను, 2,400 విద్యుత్ స్తంభాలను కవర్ చేస్తూ 86 కిలోమీటర్ల 33 kV విద్యుత్ లైన్లను సర్వే చేయడానికి డ్రోన్‌లను మోహరించారు. అదనంగా థర్మోగ్రాఫిక్ టెక్నాలజీని ఉపయోగించి 900 పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌లను తనిఖీ చేశారు. ఈ తనిఖీల ద్వారా విద్యుత్ స్తంభాలు, ఇన్సులేటర్లు, జంపర్లు, కనెక్షన్లు , ఇతర విద్యుత్ పరికరాల పరిస్థితిని అంచనా వేయడంతో పాట నిర్వహణ అవసరాలను ముందుగానే గుర్తించడానికి కంపెనీకి వీలవుతుంది.

Leave A Reply

Your Email Id will not be published!