సమంత రుత్ ప్ర‌భు మెటర్నిటీ ఫోటోషూట్ వైరల్

త్వ‌ర‌లోనే మాతృత్వ‌పు అనుభూతి

హైద‌రాబాద్ : ప్రముఖ నటి సమంత త్వరలోనే మాతృత్వపు మధురానుభూతిని పొందబోతున్నారు. తన భర్త, ప్రఖ్యాత దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. తన గర్భధారణ ప్రయాణానికి సంబంధించిన విశేషాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బేబీ బంప్‌తో ఉన్న ఒక కొత్త ఫోటోను పోస్ట్ చేశారు. సాధారణంగా సెలబ్రిటీలు భారీ సెట్లు, డిజైనర్ దుస్తులతో గ్రాండ్‌గా మెటర్నిటీ ఫోటోషూట్‌లు చేయించుకుంటారు. కానీ సమంత అందుకు భిన్నంగా, చాలా సాధారణమైన, నిత్య జీవితానికి దగ్గరగా ఉండే వాతావరణంలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇంట్లో సోఫాపై హాయిగా విశ్రాంతి తీసుకుంటున్న తన ఫోటోను ఆమె పంచుకున్నారు. ఎరుపు రంగు టాప్, తెల్లని ప్యాంటు, నల్లని సన్ గ్లాసెస్ ధరించి, తన బేబీ బంప్‌ను సున్నితంగా పట్టుకుని ఆమె చాలా కూల్‌గా కనిపించారు. ఈ ఫోటోకు ఆమె, “దీన్నే నా మెటర్నిటీ షూట్‌గా భావించండి” అని సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫోటో ఇంటర్నెట్‌లో నిమిషాల వ్యవధిలోనే వైరల్ అయింది.

అభిమానులు, నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ ఆమెపై ప్రేమను కురిపించారు. నేను చూసిన అత్యంత కూల్ ‘కాబోయే తల్లి’ మీరే అని ఒక అభిమాని ప్రశంసించారు. ఈ పాపాయి/బాబు ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. జూనియర్ సమంత రాబోతోంది అంటూ చాలామంది శుభాకాంక్షలు తెలిపారు. సమంత , రాజ్ నిడిమోరు 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరు లోని ఈషా యోగా సెంటర్‌లో తమ కుటుంబ స‌భ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కొద్ది వారాల క్రితం ఈషా ఫౌండేషన్‌లో సాంప్రదాయ పద్ధతిలో ‘సీమంతం’ వేడుకను కూడా జరుపుకున్నారు. అంతకు ముందు, 2026 జూన్‌లో హైదరాబాద్‌లో జరిగిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ మీట్‌లో సమంత తన గర్భధారణ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. అప్పటికే అంగీకరించిన ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత, జీవితంలోని ఈ అద్భుతమైన కొత్త దశను ఆస్వాదించడానికి సినిమాల నుండి కొంత విరామం తీసుకుంటానని ప్ర‌క‌టించారు. ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, మాతృత్వ బాధ్యతలను స్వీకరించిన తర్వాత తాను తిరిగి వెండితెరపైకి వస్తానని సమంత స్పష్టం చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!