చెన్నై : సూర్య నటించిన తాజా తమిళ చిత్రం సీన్ దుమ్ము రేపుతోంది కలెక్షన్ల పరంగా. నవంబర్ 6 న థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను అందుకుంటోంది. జిత్తు మాధవన్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్లో నజ్రియా నజీమ్, నాస్లెన్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో మంచి ఆదరణ పొందుతున్న ఈ చిత్రం ఇప్పుడు తన ఓటీటీ విడుదల వార్తలతో చర్చనీయాంశమైంది. నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ చిత్ర డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసిందన డిసెంబర్లో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కావచ్చని సమాచారం.
రణబీర్ కపూర్ నటించిన ‘రామాయణం: పార్ట్ 1’తో పోటీ పడుతున్నప్పటికీ ‘సీన్’ చిత్రం ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల్లో మంచి సంఖ్యలో ప్రేక్షకులను ఆకర్షించగలిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొన్ని దక్షిణ భారత మార్కెట్లలో మొదటి సోమవారం నాడు, ‘రామాయణం’ చిత్రం డబ్బింగ్ వెర్షన్ల కంటే ‘సీన్’ మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు తెలుస్తోంది. థియేటర్లలో సినిమా ప్రదర్శన కొనసాగు తుండటంతో అభిమానులు ఇప్పుడు దీని ఓటీటీ విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.నెట్ఫ్లిక్స్ సంస్థ ‘సీన్’ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు రూ. 88 కోట్లకు కొనుగోలు చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ ఒప్పందం ప్రకారం థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది.
‘సీన్’ చిత్రం 6న థియేటర్లలో విడుదలైనందున ఇది డిసెంబర్ 4వ తేదీన నెట్ఫ్లిక్స్లో వచ్చే అవకాశం ఉంది. ఈ షెడ్యూల్ మారకపోతే డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆన్లైన్లో చూడవచ్చు. అయితే, నెట్ఫ్లిక్స్ కానీ లేదా చిత్ర బృందం కానీ ఇప్పటివరకు ఓటీటీ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించలేదు. బాక్సాఫీస్ వద్ద సినిమా ప్రదర్శనను బట్టి ఈ స్ట్రీమింగ్ తేదీ మారే అవకాశం కూడా ఉంది