గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భ‌ద్ర‌త చ‌ట్టం

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు స‌ర్కార్ శ్రీ‌కారం

హైద‌రాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల కు సామాజిక భద్రత, సంక్షేమ విధానాన్ని తీసుకు వ‌చ్చింది. శ‌నివారం హైద‌రాబాద్ లో జ‌ర‌గిన కార్య‌క్ర‌మంలో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి , లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తో కలిసి ఈ కార్య‌క్ర‌మాన్ని ఆవిష్కరించారు. గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల నమోదుకు ఆన్‌లైన్ విధాన్ని ప్రారంభించారు. దేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలోని జయభేరీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక నుంచి గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల సంక్షేమానికి సంబంధించిన చట్టాన్ని అంకితం చేశారు.

తెలంగాణ ప్లాట్‌ఫామ్ బేస్ట్ గిగ్ వ‌ర్క‌ర్స్ నిబంధనపై రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమం ప్రారంభంలో నెహ్రూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అంతకు ముందు శిల్పారామం నుంచి జయభేరీ గ్రౌండ్స్ వరకు చేపట్టిన భారీ బైక్ ర్యాలీలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గిగ్ వ‌ర్క‌ర్స్ తో క‌లిసి బైక్ పై ప్ర‌యాణం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నెహ్రూ జన్మదినం రోజున గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ చట్టాన్ని ప్రజలకు అంకితం చేశామని చెప్పారు. ఈ చట్టం నేటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. ఈ చట్టం వల్ల ప్రతి గిగ్ వర్కర్‌కు రూ. 5 లక్షల జీవిత బీమా సౌకర్యం లభిస్తుందని, ఆరోగ్య భద్రత కోసం రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షల అందజేస్తున్నట్టు తెలిపారు. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయడమే కాకుండా వర్కర్లకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డు లభిస్తుందని చెప్పారు.

గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ కోసం చట్టం రూపొందించడానికి ఐఐటీ లాంటి సంస్థలతో పాటు సామాజిక కార్యకర్త నిఖిల్ ఏమీ ఆశించకుండా ఎంతో సహకారం అందించారని చెప్పారు. గిగ్ వర్కర్ల నాయకులు, నిపుణులతో అనేక సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ చట్టం రూపొందించామని తెలిపారు . గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. విధుల్లో ఉండగా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు గిగ్ కార్మికుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , మంత్రులు దామోదర రాజనర్సింహ , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , వివేక్ వెంకటస్వామి , పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు, గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్లు పాల్గొన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!