విశాఖలో సినిమా, క్రియేటర్ ఎకానమీ అభివృద్ధికి సహకారం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే భోగాపురం ఎయిర్‌పోర్ట్

విశాఖపట్నం: విశాఖ నగరం రాష్ట్రానికి ప్రవేశ ద్వారం అయితే, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి గేట్ వే లాంటిదని విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖలో 31వ సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లో ‘ది పవర్ ఆఫ్ పాసిబిలిటీ: బిల్డింగ్ పార్ట్‌నర్‌షిప్స్, క్రియేటింగ్ ది ఫ్యూచర్’ అనే అంశంపై ప్రముఖ సినీనటుడు రానా దగ్గబాటి నిర్వహించిన పాడ్ కాస్ట్ కు మంత్రి లోకేష్ అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ… భోగాపురం ఎయిర్ పోర్టు హైదరాబాద్ విమానాశ్రయం కంటే పెద్దదిగా ఎదిగిన రోజే తనకు నిజమైన సంతృప్తి కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఇలాంటి పెద్ద లక్ష్యాలు కీలకమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల అవకాశాలు, బ్రాండ్ ఆంధ్ర, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, పర్యాటక అభివృద్ధి, సినిమా పరిశ్రమ, క్రియేటర్ ఎకానమీ, యువతకు ఉపాధి–వ్యాపార అవకాశాలు తదితర అంశాలపై రానా అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ సూటిగా సమాధానాలిచ్చారు.

రాబోయే రెండు దశాబ్ధాల్లో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉందన్నారు. విశాఖను దేశానికి ఆర్థిక శక్తి కేంద్రంగా తీర్చిదిద్దాలన్న నమ్మకంతో పని చేస్తున్నామ‌ని తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ ప్రాజెక్టును ఉదాహరణగా వివరిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఆలోచనను ముందుకు తీసుకొచ్చి, నిపుణులు, ప్రపంచ స్థాయి సంస్థలను ఒకచోట చేర్చి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారని చెప్పారు. ఆ ప్రయత్నంలో భాగంగా అమరావతిలో భారతదేశంలోనే తొలి 156 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం అన్నారు నారా లోకేష్. విశాఖపట్నంలో ప్రస్తుతం సుమారు 17 స్టార్ హోటళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ లాంటి భారీ అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించాలంటే మరింత పెద్ద స్థాయిలో ఆతిథ్య రంగ మౌలిక సదుపాయాలు అవసరం అని పేర్కొన్నారు. ఆలయ పర్యాటకం, బ్లూ ఫ్లాగ్ బీచ్‌లు, అరకు వంటి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాల్సి ఉందన్నారు. అరకు లోయలో మారథాన్ నిర్వహణకు మహీంద్రా సంస్థతో చర్చలు జరుపుతున్నామ‌ని తెలిపారు. చంద్రబాబు నాయుడు అరకు కాఫీని ప్రపంచ బ్రాండ్‌గా తీర్చిదిద్దిన విధానం అద్భుతం. మన ప్రాంతీయ ప్రత్యేకతలపై మనకు నమ్మకం ఉండాలి, వాటికి తగిన గుర్తింపు తీసుకొచ్చేలా ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేయాలన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!