మినీ రిజర్వాయర్‌గా ఫాక్స్ సాగర్ చెరువు : కమిషనర్
మినీ ట్యాంక్‌బండ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు
హైదరాబాద్ : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జీడిమెట్ల ప్రాంతంలో ఎంతో చారిత్రక వైభవం ఉన్న ఫాక్స్ సాగర్ పునరుద్ధరణ పనులను హైడ్రా ప్రారంభించింది. ఆక్రమణలతో పాటు దుర్గంధాన్ని తొలగించి చెరువుకు కొత్త రూపునిచ్చేందుకు శ్రీకారం చుట్టింది.హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ భూమి పూజ చేసి ఫాక్స్‌సాగర్ చెరువు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువును పునరుద్ధరించి మినీ రిజర్వాయర్ తరహాలో అభివృద్ధి చేస్తామన్నారు. ఏడాది కాలంలో ఇక్కడ అద్భుతమైన సరస్సును చూడబోతున్నారని పేర్కొన్నారు. చెరువు రూపురేఖలు మారి.. మినీ ట్యాంక్ బండ్‌గా దీనిని తీర్చిదిద్దుతామన్నారు. మురుగు నీరు, కెమికల్ వ్యర్థాలతో దుర్గంధ భరితంగా ఈ చెరువు మారి పోయిందన్నారు. పెద్దమొత్తంలో పూడిక ఉండడంతో భూమిలోకి నీరు ఇంకని పరిస్థితి నెలకొందన్నారు. దీంతో ఈ పరిసరాల్లో భూగర్భ జలాలు తగ్గిపోవడమే కాదు.. కొద్ది మొత్తంలో ఉన్నా.. అవి క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులకు కారణమయ్యేవిగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ఈ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్ది.. శుద్ధ జలాలతో నింపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.
ఆ దిశగా హైడ్రా చర్యలు చేపట్టిందన్నారు. ఒకప్పుడు మురుగు నీరు, గుర్రపు డెక్కతో చెరువు ఉణికినే కోల్పోయే విధంగా ఉన్న మాధాపూర్‌లోని తమ్మిడికుంట నేడు ఎంతో సుందరంగా హైడ్రా తీర్చిదిద్దిందని చెప్పారు. అలాగే ఫాక్స్ సాగర్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నట్టు హైడ్రా కమిషనర్ చెప్పారు. ప్లాస్టిక్, కెమికల్ వ్యర్థాలతో భూమిలోకి నీరు ఇంకని పరిస్థితి ఉందన్నారు. 5 మీటర్ల మేర పూడికను తొలగించి ప్రస్తుతం 1000 మిలియన్ లీటర్ల సామర్థ్యానికి పరిమితమై పోయిన ఫాక్స్ సాగర్ చెరువును 4 వేల మిలియన్ లీటర్లకు పెంచడమే లక్ష్యంగా పనులు జరుతున్నాయని తెలిపారు. మురుగు నీరు, పారిశ్రామిక వ్యర్థ జలాలు నేరుగా చేరకుండా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు. చెరువులోకి వరద నీరు చేరేలా చర్యలు తీసుకోవడంతో పాటు.. 2000లో వరదల సమయంలో ఎదురైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరదనీటి నిర్వహణ వ్యవస్థను పటిష్ఠం చేస్తామని చెప్పారు.