ఛత్తీస్ గఢ్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్లో ఉన్న అనుమతుల గురించి చర్చించారు. ఈ బ్యారేజీ కోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుండి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC) ఇవ్వాలని కోరారు. అలాగే నీటిని నిల్వ చేసుకునేందుకు అనుమతించాలని రేవంత్ రెడ్డి విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఎన్ఓసీ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ‘ఎల్ నినో’ (El Niño) పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం చెల్లింపులు , పునరావాసానికి అవసరమైన నిధులను భరించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ఐఐటీ ఖరగ్పూర్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ ఈ ప్రాజెక్టు వల్ల ఛత్తీస్గఢ్లో కేవలం 33 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని, అత్యంత భారీ వరదలు వచ్చినప్పటికీ ఈ విస్తీర్ణం 100 ఎకరాలకు మించదని ఆయన వివరించారు. తుపాకుల గూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని చెప్పారు సీఎం. 83 మీటర్ల పూర్తి రిజర్వాయర్ స్థాయి (FRL) వద్ద ఈ ప్రాజెక్టులో 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు అని తెలిపారు. గోదావరి జలాలను సాగునీటి అవసరాలకు , తాగునీటి అవసరాలకు వినియోగించు కోవడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఛత్తీస్గఢ్లో భూసేకరణ, పరిహారం, పునరావాసానికి అవసరమైన నిధులను నిబంధనల ప్రకారం చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని వివరించారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్ఓసీని త్వరగా జారీ చేయాలని కోరారు. మిగిలిన అనుమతుల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
