ఎంవోయూ జరిగిన ప్రతి ఎనర్జీ ప్రాజెక్టు గ్రౌండ్ అవ్వాలి

విద్యుత్ అవసరాలకు ప్రైవేట్ సెక్టార్‌పై ఆధార పడడం తగ్గించాలి

అమరావతి : రాష్ట్రంలో పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్‌ అంచనా వేసి తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించి తక్షణం వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ప‌ష్టం చేశారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎల్ నినో వంటి సమస్యల కారణంగా వర్షాకాలంలో కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని…ఇలాంటి సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుని ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు విద్యుత్ డిమాండ్ 18.23 శాతం పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు మార్కెట్‌లో విద్యుత్ ధరలు కూడా తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం ప్రైవేటు సంస్థలపై ఆధార పడడం తగ్గించాలని సీఎం సూచించారు. దీనికోసం ప్రణాళికా బద్దంగా ప్రభుత్వ ప్రాజెక్టులు గ్రౌండ్ చేయాలన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల్లో హామీ ఇచ్చామని…దానికి కట్టుబడి ఉన్నామని గుర్తు చేసిన సీఎం విద్యుత్ కొనుగోలు భారం తగ్గించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాల్లో ఏఐ వంటి టెక్నాలజీని ఉపయోగించి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. అప్పుడు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉండదని సీఎం అన్నారు. విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ల చోరీల అంశం కూడా సమీక్షలో చర్చకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయని అధికారులు తెలిపారు. రాగి తీగలు కోసం ట్రాన్స్ ఫార్మర్లు దొంగిలిస్తున్నారని అధికారులు తెలుపగా….ఇటువంటి చర్యలకు పాల్పడుతోన్న వారిపట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్న వారిని వదిలిపెట్టవద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో దర్యాప్తునకు పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని… చోరీలకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని సీఎం అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!