ద‌ళితుల జోలికి వ‌స్తే ఊరుకునేది లేదు : ఈట‌ల రాజేంద‌ర్

కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని తీవ్రంగా హెచ్చ‌రించిన బీజేపీ ఎంపీ

హైద‌రాబాద్ : బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కాంగ్రెస్ స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ప్ర‌జా పాల‌న పేరుతో రాచ‌రిక పాల‌న‌కు తెర తీశారంటూ మండిప‌డ్డారు. రాబోయే రోజుల్లో తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు. హ‌యత్ న‌గ‌ర్ లో ద‌ళితుల‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. వారి త‌ర‌పున ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. ఆనాడు ఇందిరమ్మ వారికి ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాగేసుకుంటోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని నిల‌దీశారు ఈట‌ల రాజేంద‌ర్. గ‌తంలో మాజీ సీఎం కేసీఆర్ తన క్రూరమైన ప్రవర్తన వల్ల ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారో, వీరికి కూడా అదే గతి పడుతుందన్నారు. వారంలోపు ఈ భూమిపై ఒక నిర్ణయం తీసుకోవాలని లేకుంటే స‌ర్కార్ నిర్మించిన గోడ‌ను తానే కూల్చి వేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చారు ఈట‌ల రాజేంద‌ర్.

తాను హైదరాబాద్‌కు వచ్చిన కొత్తలో మలక్‌పేట చివరి ప్రాంతంగా ఉండేదన్నారు. అప్పట్లో ఇక్కడ ఎకరం భూమి ధర కేవలం 100 రూపాయలు మాత్రమే. అరవై ఏళ్ల క్రితం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో పేదలకు భూములను కేటాయించింది. సర్వే నంబర్ 255లో ఉన్న 74 ఎకరాలలో 37 ఎకరాలను రైతులు/పేదలకు ఇచ్చారు. వారందరి దగ్గరా పాస్‌బుక్‌లు ఉన్నాయి. ‘ధరణి’ పోర్టల్ వచ్చే వరకు వారు ఈ భూములను అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ వారు అక్కడ కూరగాయలు పండిస్తున్నారు. వారు అక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు, అంతే కాకుండా G.O. నంబర్లు 58 , 59 కింద వాటిని క్రమబద్ధీకరించుకున్నారు కూడా. ఇక్కడ నివసించే వారంతా పేదలేన‌ని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఈ భూమిని లాగేసుకుంటామని చెబుతోంది. రింగ్ రోడ్డు నిర్మాణం జరిగినప్పుడు, అసైన్డ్ భూములకు పరిహారం కోసం మేమే పోరాటం చేశాం అన్నారు. అప్పటి ప్రభుత్వం అందుకు అనుగుణంగా పరిహారం కూడా చెల్లించిన‌ట్లు తెలిపారు. ఈ భూమిని ప్రభుత్వం లాక్కోకూడదని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. వీరంతా పేదవారు కాబట్టి, వారికి ఇళ్లు నిర్మించి ఇచ్చి ఆ భూమిని వారికే అప్పగించాలని అన్నారు. భూములను లాగేసుకునే ప్రక్రియ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మొదలైందన్నారు. ‘ధరణి’ని ప్రవేశ పెట్టినప్పుడు, భూమిని అనుభవిస్తున్న కాలానికి సంబంధించిన వివరాలను తొలగించేశారని ఆరోపించారు. ఆ భూములను ‘ప్రభుత్వ భూములు’గా మార్చేశారు. అప్పుడు భూములను ఆక్రమించుకునే వారికి ఎటువంటి అడ్డంకులు లేకుండా పోయాయని మండిప‌డ్డారు ఈట రాజేంద‌ర్.

అప్పట్లో కేసీఆర్ చాలా క్రూరంగా వ్యవహరించారు, ప్రజలను భయపెట్టడానికి పోలీసులను ఉపయోగించారు. ఆ ఆగ్రహంతోనే ప్రజలు త‌న‌ను ఓడించారు. వారు కేసీఆర్‌ను తిరస్కరించి రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు… కానీ, 500 గజాల స్థలం ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు 300 గజాలే ఇస్తామంటూ ప్రజలను మరింతగా మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

Leave A Reply

Your Email Id will not be published!