కూతురిపై కామెంట్స్ అర్జున్ స‌ర్జా సీరియ‌స్

ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తే ఎలా

చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు అర్జున్ స‌ర్జా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ కుమార్తె గౌరవం విషయంలో మౌనంగా ఉన్నానంటే, దానికి నేను అంగీకరించినట్లు కాద‌ని ఆయ‌న పేర్కొన్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. తన కుమార్తె వ్యక్తిగత జీవితం గురించి నిరాధారమైన కథనాలు వస్తుంటే ఏ తండ్రి మౌనంగా ఉండగలడు? అంటూ ప్ర‌శ్నించాడు. దర్శకుడు, న‌టుడు అర్జున్ సర్జా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తన పెద్ద కుమార్తె ఐశ్వర్య సర్జా వివాహ జీవితం, వ్యక్తిగత అలవాట్ల గురించి వస్తున్న కథనాల ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. నిరాధార‌మైన క‌థ‌నాల‌ను ఆయన తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా ఆమెకు మద్యం అలవాటు ఉందంటూ వస్తున్న ఆరోపణలు అత్యంత బాధ్యతా రాహిత్యమైనవని అర్జున్ స‌ర్జా పేర్కొన్నారు.

నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యను 2024లో వివాహం చేసుకున్న ఐశ్వర్యకు సంబంధించి జరుగుతున్న ఈ ప్రచారంపై కుటుంబ సభ్యులు మొదట్లో మౌనం వహించారు. అయితే, ఈ మౌనాన్ని అంగీకారంగా భావించకూడదని, తప్పుడు సమాచారం పదేపదే ప్రచారమవుతుంటే తాను చూస్తూ ఊరుకోబోనని అర్జున్ స‌ర్జా స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులకు అధికారికంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఇది కేవలం తన కుమార్తెకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, ప్రతి మహిళ వ్యక్తిగత జీవితాన్ని బహిరంగ చర్చాంశంగా మార్చి, వారి గౌరవానికి భంగం కలిగించే ధోరణికి సంబంధించిన విషయమని అన్నారు. ఒక మహిళ తనకు నచ్చినట్లుగా జీవించే హక్కును కాపాడటం సమాజ బాధ్యత కూడా అని స్ప‌ష్టం చేశారు. ఒక తండ్రిగా తన కుమార్తె గౌరవం, స్వేచ్ఛ , స్వతంత్రతకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని నొక్కి చెప్పారు.

Leave A Reply

Your Email Id will not be published!