హైదరాబాద్ : తెలంగాణను ఆరోగ్య రంగంలో ప్రపంచానికే ఆదర్శంగా తీర్చి దిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు , ఆసుపత్రి యాజమాన్యాలు కలిసి పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని వైద్య సేవా సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి విస్తరించి నగరాన్ని ‘మెడికల్ టూరిజం’ (వైద్య పర్యాటకం)లో ప్రపంచ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన ‘గ్లోబల్ సమ్మిట్ హెల్త్‌కేర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్’ సమావేశానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య రంగాల్లో వస్తున్న మార్పులు, తెలంగాణలో వైద్య సేవల విస్తరణ, మెడికల్ టూరిజం అభివృద్ధి, వైద్య విద్య, నైపుణ్యాభివృద్ధి , ఇతర సంబంధిత అంశాలపై చర్చలు జరిగాయి.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని ప్రభుత్వ , ప్రైవేట్ రంగాల్లో ప్రపంచ స్థాయి వైద్య నిపుణులు, అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
వీటిని సమన్వయం చేయడం ద్వారా రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకు రావాలని ఆయన సూచించారు. తెలంగాణ అభివృద్ధి లక్ష్యంతో నిర్వహించనున్న ‘గ్లోబల్ సమ్మిట్’లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రతినిధులందరూ పాల్గొని, దానిని విజయవంతం చేయాలని మంత్రి కోరారు. కేవలం ప్రైవేట్ రంగంలోనే కాకుండా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మెడికల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఫార్మా వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కొండపల్లి సాహితి, కిమ్స్-సన్‌షైన్ ఎండీ డాక్టర్ గురువారెడ్డి, ఫిక్కీ (FICCI) సభ్యులు, సర్జన్ కెప్టెన్ డాక్టర్ విజయ్ కుమార్, రెయిన్బో హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్, ఐక్యరాజ్యసమితి మాజీ అధికారి డాక్టర్ శివ దుబిశెట్టి, యశోద హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ దశరథ రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
