భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేయొద్దు : కమిషనర్

గేటెడ్‌ కమ్యూనిటీలో ఎస్‌టీపీ పనితీరు, నీటి నాణ్యత పరిశీలన

హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గేటెడ్ కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసిన మురుగునీటి శుద్ధి కేంద్రాలు వంద శాతం సామర్థ్యంతో పనిచేసేలా చూడాలని, వాటి ద్వారా శుద్ధి చేసిన నీటిని కూడా పూర్తిస్థాయిలో పునర్వినియోగంలోకి తీసుకు రావాలని నిర్వాహకులను ఆదేశించారు. నీటి అవసరాల కోసం భూగర్భ జలాలపై ఆధార పడటాన్ని తగ్గించాలని సూచించారు. ఒకవైపు వాడిన నీటిని వృథాగా వదిలేస్తూ మరోవైపు బోర్ల ద్వారా భూగర్భ జలాలను తోడేయడం సరికాదన్నారు. శుద్ధి చేసిన నీటిని గార్డెనింగ్, ఇతర అవసరాలకు వినియోగించు కోవడం ద్వారా నీటి వనరులను సంరక్షించు కోవాలని కోరారు. నల్లగండ్లలోని నల్లగండ్ల చెరువు అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సమీపంలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఎస్‌టీపీ పనితీరును హైడ్రా కమిషనర్ తనిఖీ చేశారు. మురుగు నీటిని సేకరించడం, శుద్ధి చేయడం, శుద్ధి చేసిన నీటిని తిరిగి వినియోగిస్తున్న విధానాన్ని పరిశీలించారు. మురుగు నీటిని శుద్ధి చేయకుండా నేరుగా మురుగు కాలువల్లోకి వదల కూడదని, తప్పనిసరిగా శుద్ధి చేసిన తర్వాతే బయటకు విడుదల చేయాలని సూచించారు. అలా చేసినప్పుడే చెరువుల్లోకి చేరే నీటి నాణ్యత మెరుగు పడుతుందని పేర్కొన్నారు.

టెడ్ క‌మ్యూనిటీలో ఎస్‌టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిపై నిర్వహించిన ప్రాథమిక ఆన్‌లైన్ పరీక్షల్లో కొన్ని కీలక అంశాలు హైడ్రా అధికారులు గుర్తించారు. నీటిలో ఉన్న సేంద్రియ వ్యర్థ పదార్థాలను సూక్ష్మజీవులు విచ్ఛిన్నం చేయడానికి అవసరమైన ఆక్సిజన్ పరిమాణం విలువ 25.5 mg/Lగా నమోదైంది. ఇది హైదరాబాద్‌లో అమలులో ఉన్న చట్టబద్ధమైన పరిమితి 20 mg/L కంటే ఎక్కువగా ఉంద‌ని తేలింది. టర్బిడిటీ (నీటి మసకదనం) 20.81 NTU (నెఫెలోమెట్రిక్ టర్బిడిటీ యూనిట్ (నీటి మసకదనాన్ని కొలిచే ప్రమాణం)గా నమోదైంది. ఈ నేపథ్యంలో మెంబ్రేన్ బయో రియాక్టర్ (పొర ఆధారిత జీవ శుద్ధి వ్యవస్థ) మెంబ్రేన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు క‌మిష‌న‌ర్. అలాగే, DO (నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్) స్థాయి 0.66 mg/Lగా నమోదైంది. తదుపరి అధికారిక విశ్లేషణ నిమిత్తం నీటి నమూనాలను సేకరించి తెలంగాణ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లికి పంపించడం జరిగిందన్నారు. ప్రయోగశాల నివేదికలు అందిన తర్వాత ఎస్‌టీపీ శుద్ధి సామర్థ్యం, పనితీరు, పర్యావరణ నిబంధనల అమలుపై తదుపరి పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!