కాంగ్రెస్ పాల‌న‌లో విచ్చ‌లవిడిగా పెరిగిన అవినీతి

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ మంత్రి కేటీఆర్

వ‌రంగ‌ల్ జిల్లా : రాష్ట్రంలో కొలువుతీరిన కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో అవినీతి, అక్ర‌మాలు విచ్చ‌ల‌విడిగా పెరిగి పోయాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ . వరంగల్‌లోని కేడీసీ గ్రౌండ్‌లో జరిగిన ప్రజా సంప్రదింపుల సమావేశంలో ప్ర‌సంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైందన్నారు. ఇక మిగిలింది కేవలం 500 రోజులే మిగిలి ఉంద‌న్నారు. 2028లో కేసీఆర్ ఖచ్చితంగా మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే స్వయంగా చెబుతున్నట్లుగా వసూళ్ల మొత్తం రూ. 5 లక్షల కోట్ల నుండి రూ. 10 లక్షల కోట్ల వరకు ఉందన్నారు. పనులు జరగాలంటే 20 శాతం కమిషన్ చెల్లించాల్సిందేనని మరో ఎమ్మెల్యేనే స్వయంగా పేర్కొన్నారని గుర్తు చేశారు. పారిశ్రామికవేత్తల తలలపై తుపాకీ పెట్టి వందల కోట్ల రూపాయలను రేవంత్ సోదరులు డిమాండ్ చేస్తున్నారని మాజీ మంత్రి కొండ సురేఖ కుమార్తెనే స్వయంగా చెప్పారని పేర్కొన్నారు కేటీఆర్.

ప్రజల కోసం పాలన సాగడం లేద‌ని, కేవలం ‘పర్సెంటేజీల’ పాలన మాత్రమే నడుస్తోందని ఆరోపించారు. ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే, సమాధానం చెప్పే బదులు రేవంత్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నార‌ని ఇది మంచి పద్ద‌తి కాద‌న్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలనే కుట్ర కేవలం రేవంత్ రెడ్డి , పొంగులేటి కుటుంబాలకు చెందిన ప్రైవేట్ విద్యా వ్యాపారాల కోసమే త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. కాంగ్రెస్ పాలనలో గత మూడేళ్లుగా వరంగల్‌లో సంక్షేమం శూన్యం అన్నారు. అభివృద్ధి అస్సలు లేదన్నారు. కనీసం ఒక్క కొత్త ఐటీ కంపెనీని గానీ, కొత్త టెక్స్‌టైల్ పరిశ్రమను గానీ తీసుకు రాలేక పోయారన్నారు.. పైగా ఉన్న పరిశ్రమలు కూడా మూత పడుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మూడేళ్లు గడిచినా, 90 శాతం పూర్తయిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనుల్లో మిగిలిన 10 శాతాన్ని కూడా పూర్తి చేయలేక పోయార‌ని పేర్కొన్నారు.

పేదల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేసే బదులు, రేవంత్ తన సొంత ‘మెడికోవర్’ (Medicover) ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ప్రాధాన్యత ఇస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.’ఫ్యూచర్ సిటీ’ (Future City) గురించి కాదు.. నిజమైన భవిష్యత్తు ఉన్న నగరం ‘వరంగల్’పై దృష్టి పెట్టాల‌ని సూచించారు కేటీఆర్. ఫార్మా సిటీ పేరు మార్చి దానిని ‘ఫ్యూచర్ సిటీ’గా ప్రచారం చేసుకోవడం అభివృద్ధి కాదన్నారు.భవిష్యత్తులో వరంగల్‌ను ఒక ప్రధాన ఐటీ , పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యతను బీఆర్ఎస్ తీసుకుంటుందన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!