రేపే తిరుమ‌ల‌లో కార్తీక పర్వ దీపోత్సవం

గ‌రుడ సేవ ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించిన టీటీడీ

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో నవంబర్ 24న‌ మంగ‌ళ‌వారం సాలకట్ల కార్తీక పర్వ దీపోత్సవాన్ని టీటీడీ ఘనంగా నిర్వహించనుంది. కార్తీక పౌర్ణ‌మినాడు శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం నిర్వహించ‌నున్న‌ట్లు టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ చైర్మ‌న్ , ఈవో ముద్దాడ ర‌విచంద్ర వెల్ల‌డించారు. ఈ సందర్భంగా సాయంత్రం 5 గంటల నుండి 8.30 గంటల వరకు నేతి వత్తులతో దీపాలను వెలిగించి ఛత్రచామర, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇస్తారని తెలిపారు.

ఆ తర్వాత వరుసగా గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారుబావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజస్తంభం, బలి పీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూలబావి, రంగనాయక మండపం, మహాద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద దీపాలను ఏర్పాటు చేస్తారు.

ఇదిలా ఉండ‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు ఈవో ముద్దాడ ర‌విచంద్ర‌. ప్రతి నెలా టీటీడీ పౌర్ణమినాడు నిర్వహించే గరుడ సేవను ఈ సందర్భంగా రద్దు చేసిన‌ట్లు తెలిపారు. అదే విధంగా కార్తీక దీపోత్సవం కారణంగా సహస్ర దీపాలంకరణ సేవను కూడా నిర్వ‌హించ‌డం లేద‌న్నారు ఈవో.

Leave A Reply

Your Email Id will not be published!