అమరావతి : ‘కాకినాడ నగర పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి శ్రేణులన్నీ కలసికట్టుగా పని చేసి ఆకుల భవానిని, కూటమి పక్షం కార్పొరేటర్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాల’ని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియమించిన సమన్వయ కమిటీతో ప్రత్యేకంగా చర్చించారు. అలాగే కూటమి పక్షాల నేతలతోనూ సమావేశం అయ్యారు. ప్రస్తుతం ఎన్నికల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎలాంటి సమస్యలున్నా కలిసి పరిష్కరించు కోవాలని, కూటమి నాయకులు సమష్టిగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయి పరిస్థితిని ఈ సందర్భంగా నాయకులు మనోహర్ కి వివరించారు. ఈ సందర్భంగా సమావేశంలో మనోహర్ మాట్లాడారు. స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించిందన్నారు.
ఈ స్ఫూర్తిని కొనసాగించేలా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన జెండాను అఖండ మెజారిటీతో ఎగిరేలా చేయాలన్నారు. కాకినాడ ప్రాంతం అంటే అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు అమితమైన అభిమానం అని చెప్పారు. ఆయన ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఒకరకంగా చెప్పాలంటే కాకినాడ ఆయన సొంత జిల్లా లాంటిదన్నారు నాదెండ్ల మనోహర్. కాకినాడ నగరపాలక సంస్థలో జనసేన విజయం ఒక ప్రభంజనంలా నిలిచేలా ప్రతి ఒక్కరూ చొరవ తీసుకొని పనిచేయాలి అని పిలుపునిచ్చారు. కూటమిలోని మూడు పార్టీలు నిత్యం చర్చించుకుని సమన్వయంతో ముందుకు సాగితే విజయం చాలా సులభం అవుతుందన్నారు. ఇటీవల జరిగిన మొదటి దశ ఎన్నికల్లోను ఇది పూర్తిగా కనిపించిందన్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మాట్లాడుకుని పరిష్కరించుకుంటే, చాలా వరకు సమస్యలు తొలగి పోతాయన్నారు. నాయకుల సఖ్యతతో పాటు కార్యకర్తల మధ్య కూడా సమన్వయం చాలా అవసరం అన్నారు.
