అమరావతి : అలలతో పోరాటం.. ఆటుపోట్లతో సహవాసం.. ప్రాణాలను పణంగా పెట్టి సాగించే వేట.. రెక్కల కష్టాన్నే నమ్ముకుని జీవించే గంగపుత్రుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రానికి ఉన్న 1,053 కిలోమీటర్ల సముద్ర తీరం అపారమైన మత్స్య సంపదకు నిలయమని, లక్షలాది కుటుంబాలకు జీవనాధారమని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మత్స్యకారుల సంక్షేమం, ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకారులకు గతంలో రూ.10 వేలుగా ఉన్న సహాయాన్ని రూ.20 వేలకు పెంచామని మంత్రి తెలిపారు. ‘మత్స్యకారుల సేవలో’ పథకం ద్వారా 2026-27లో తొలి విడతగా 1,28,388 కుటుంబాలకు రూ.256.776 కోట్లు విడుదల చేయగా, రెండో విడతలో మరో 5,910 కుటుంబాలకు రూ.11.82 కోట్లు మంజూరు చేశామన్నారు. మొత్తంగా 1,34,298 కుటుంబాలకు రూ.268.60 కోట్ల మేర ఆర్థిక సహాయం అందించేలా చర్యలు చేపట్టామని వివరించారు. సంప్రదాయ మత్స్యకారుల హక్కులను దెబ్బతీసిన జీవో 217ను రద్దు చేసి సహకార సంఘాల ప్రయోజనాలను పరిరక్షించామని చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధికి భంగం కలిగించే నిర్ణయాలను సహించబోమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో సుమారు 2.16 లక్షల మంది రైతులు 5.79 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తున్నారని మంత్రి తెలిపారు. అర్హులైన నమోదిత రైతులకు జోన్, నాన్ జోన్ పరిమితులతో సంబంధం లేకుండా యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించే నిర్ణయం తీసుకున్నామన్నారు. మత్స్యకారుల పడవలకు లీటరు డీజిల్‌పై రూ.9 రాయితీ అందిస్తున్నామని, 2026-27 బడ్జెట్లో ఇందుకోసం రూ.52 కోట్లు కేటాయించామని చెప్పారు. 200 యాంత్రిక పడవలను 60 శాతం రాయితీతో అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన నిర్ణయాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) కింద రాష్ట్రంలో రూ.2,328.89 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని మంత్రి తెలిపారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.681.38 కోట్లని చెప్పారు. పథకంలోని 41 రకాల కార్యక్రమాల ద్వారా 5,23,269 యూనిట్లు మంజూరు కాగా, 4,58,139 యూనిట్ల అమలు ప్రారంభమైందన్నారు. జీవనోపాధి, పోషకాహార సహాయానికి సంబంధించిన 4,42,720 యూనిట్లతో పాటు 776 ఐస్ బాక్స్ మోటారు సైకిళ్లు, 2,269 మినీ ఫిష్ కియోస్క్‌లు, 8,144 కమ్యూనికేషన్, ట్రాకింగ్ పరికరాల యూనిట్ల అమలు ప్రారంభమైనట్లు వివరించారు. మిగిలిన యూనిట్లను వేగవంతం చేస్తామని తెలిపారు. మత్స్య ఉత్పత్తుల నిల్వ, రవాణా, మార్కెటింగ్ కోసం 3 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 16 కోల్డ్ స్టోరేజీ, ఐస్ ప్లాంట్లు, 5 మేత తయారీ ప్లాంట్లు, ఒక సమగ్ర ఆక్వా పార్కు వంటి ప్రాజెక్టులకు ఆమోదం లభించిందన్నారు. వీటి ద్వారా మత్స్యకారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు.
