టీటీడీ ఉద్యోగులు, కుటుంబీకుల‌కు ఖుష్ క‌బ‌ర్

ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్..గార్డాసిల్-9 టీకా

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం స్పెసిఫైడ్ అథారిటీ చైర్మ‌న్ , ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (ఈవో) ముద్దాడ ర‌విచంద్ర కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. టీటీడీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఉచిత హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఈవో తెలిపారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన ప్రాంగణంలోని సెంట్రల్ ఆసుపత్రిలో ఈ కార్యక్రమాన్ని ఈవో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పిల్లలకు అత్యాధునిక గార్డాసిల్-9 వ్యాక్సిన్‌ను పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. 9 నుంచి 25 ఏళ్లలోపు వారికి ఈ టీకా వేయనున్నట్లు చెప్పారు. తొలి విడతలో 2,000 డోసులను సేకరించామని, అవసరాన్ని బట్టి మరిన్ని డోసులు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.

ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు వారి కుటుంబాల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈవో ర‌విచంద్ర‌. టీటీడీ సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి మాట్లాడుతూ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ ద్వారా సర్వైకల్ క్యాన్సర్‌తో పాటు ఇతర హెచ్‌పీవీ సంబంధిత క్యాన్సర్ల ముప్పును తగ్గించవచ్చని తెలిపారు. బాలికలతో పాటు బాలురకు కూడా ఈ వ్యాక్సిన్ ప్రయోజనకరమని చెప్పారు. హెచ్‌పీవీకి చెందిన తొమ్మిది రకాల వైరస్ వేరియంట్ల నుంచి రక్షణ కల్పించడం గార్డాసిల్-9 ప్రత్యేకత అని వివరించారు.

గార్డాసిల్-9 వ్యాక్సిన్ ఒక్కో డోసుకు టీటీడీకి రూ.3,000 ఖర్చవుతుండగా, మార్కెట్‌లో దీని ధర సుమారు రూ.13,000 నుంచి రూ.14,000కు పైగా ఉందని తెలిపారు. కంపెనీ నుంచి రాయితీ ధరకు వ్యాక్సిన్లను సేకరించి, టీటీడీ నిధులతో అర్హులైన ఉద్యోగుల పిల్లలకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు. 9 నుంచి 14 ఏళ్లలోపు వారికి: మొదటి డోసు అనంతరం ఆరు నెలలకు రెండో డోసు.
15 నుంచి 25 ఏళ్లలోపు వారికి: మొదటి డోసు, రెండు నెలలకు రెండో డోసు, ఆరు నెలలకు మూడో డోసు ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!