అమరావతి : ఉత్తరాంధ్ర ప్రాంతంలో జనసేన పార్టీ పునాదులు బలంగా నిర్మించుకునేలా ప్రతి ఒక్కరు కష్టపడాలని పిలుపునిచ్చారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇక్కడి ప్రజలు, వారి తెగువ, పోరాటం, శ్రమ అన్నా, ఈ ప్రాంతం తాలూకా కళలు, సంస్కృతి, సంప్రదాయాలు అంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు అమితమైన అభిమానం ఉందన్నారు. ఉత్తరాంధ్రకు కీలకమైన శ్రీకాకుళం నగర పాలక సంస్థకు జరుగుతున్న ఎన్నికల్లో కూటమి సాధించే గెలుపు బలంగా ఉండాలని అన్నారు. దాని కోసం పార్టీ లోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా పనిచేసి, కూటమి పార్టీ నాయకులనూ కలుపుకొని వెళ్లాల్సిన అవసరం ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ నెల 26న జరగనున్న శ్రీకాకుళం నగర పాలక సంస్థ ఎన్నికల పార్టీ సమన్వయ కమిటీ సమావేశం, ఎన్నికల్లో తలపడుతున్న అభ్యర్థులతో స్నేహపూర్వక సమావేశం శ్రీకాకుళం లో జరిగింది.
ఈ సమావేశంలో మనోహర్ పాల్గొని కమిటీ నాయకులకు, అభ్యర్థులకు గెలుపుపై దిశా నిర్దేశం చేశారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న డివిజన్లపై అక్కడ ప్రధానంగా సమస్యలు, ఇబ్బందుల మీద దృష్టి పెట్టాలన్నారు. సమయం తక్కువగా ఉన్న దృష్ట్యా పార్టీ నాయకులు అందరిని ఎన్నికల క్రతువులు భాగస్వామ్యం చేయాలన్నారు. ప్రతి ఒక్కరికి తగిన బాధ్యతలను అప్పగించాలన్నారు. ప్రచారం జరుగుతున్న తీరును, ఎన్నికల సరళని నిత్యం గమనిస్తూ శ్రేణులను సమాయత్తం చేయాలని పేర్కొన్నారు. జనసేన పార్టీ పోటీ చేస్తున్న డివిజన్ అభ్యర్థులతోపాటు కూటమి పార్టీలు పోటీ చేస్తున్న చోట్ల కూడా పార్టీ శ్రేణులను యాక్టివ్ చేసి ప్రచారంలో తిరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
