అమరావతి : రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని మరింత ఆధునికంగా, లాభసాటిగా తీర్చిదిద్దేందుకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, ఉద్యాన శాఖలపై సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇటీవల సంభవించిన వరుస తుఫాన్లు, ఎల్ నినో విపత్తుల వంటి ప్రకృతి వైపరీత్యాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో పంట నష్టాన్ని నివారించేలా సాగు విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు, స్పష్టమైన ఫలితాలు, అధిక లాభాలు కనిపించాలని స్పష్టం చేశారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు సహకారంతో సుమారు రూ.40 వేల కోట్ల నిధులను సమీకరించాలని అన్నారు. మిగిలిన రూ.60 వేల కోట్లను వివిధ పెట్టుబడుల ద్వారా సమకూర్చుకుని కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు.
వీలైనంత త్వరలో హార్టికల్చర్ హబ్ పనులు ప్రారంభించాలని, ప్రతినెలా పురోగతిపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో ప్రకృతి వ్యవసాయం, మైక్రో ఇరిగేషన్కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్యాన పంటల్లో కొత్త రకాలను పరిచయం చేస్తూ ఆధునిక సాగు విధానాలను ప్రోత్సహించాలని తెలిపారు. ఉద్యానవన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు, బలోపేతం చేసేందుకు ప్రత్యేకంగా ‘హార్టికల్చర్ సమ్మిట్’ను నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని, పంటల ఉత్పత్తి నుంచి ప్రాసెసింగ్, మార్కెటింగ్ వరకు సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు.
ఉద్యానవన పంటల సాగుతో కరువు పరిస్థితులను అధిగమించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఉద్యానవన సాగులో అన్ని రాష్ట్రాల కంటే ఏపీ ముందుందని అధికారులు వివరించారు. వ్యవసాయంలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. అందుబాటులో ఉన్న ఆధునిక వ్యవసాయ యంత్రాలను ప్రదర్శించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. ఆధునిక పంటల సాగును ప్రోత్సహించడంతో పాటు కొత్త రకాల పంటలను రైతులకు పరిచయం చేయాలని, భూసార పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. రైతులతో పాటు కౌలు రైతుల ప్రయోజనాలను కూడా కాపాడాలని సూచించారు.
