అమరావతి : తుఫాన్ల కారణంగా పంటలకు నష్టం వాటిల్లకుండా అవసరమైతే పంటల సాగు క్యాలెండర్ను ముందుకు జరపాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి సాగును ముందుగానే ప్రారంభించి తుఫాన్ల ప్రభావం పంటలపై పడకుండా చూడాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంలో సాగు చేసిన వరి పంటలకు ఇటీవల సంభవించిన తుఫాన్లతో పెద్దగా నష్టం వాటిల్లలేదని, దీనిపై వరి రైతుల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ప్రతి పంట సీజన్ ప్రారంభానికి ముందే సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. వాతావరణ పరిస్థితులు, మార్కెట్ అవసరాలు, నీటి లభ్యత, పంటల సాగు కాలం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. 2027-28 నాటికి 26.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రోత్సహించాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తరించాలని తెలిపారు.
రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించే రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను ఉటంకిస్తూ మరోసారి కేంద్రానికి లేఖ రాయాలని తెలిపారు. అలాగే, కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలని అన్నారు. జలధార-2 పనులను మార్చి నాటికి పూర్తి చేయాలని, అవసరమైతే జలధార-3 కార్యక్రమాన్ని కూడా చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. రాష్ట్రంలో వర్షపాతం ఎంత నమోదవుతోంది, భూగర్భ జలాల లభ్యత ఎంత ఉందనే అంశాలపై కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉండాలని, వర్షపు నీటి వినియోగం, భూగర్భ జలాల సంరక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
